జాతీయ వార్తలు

ప్రధాని దుస్తులు మార్చినట్లుగా నిబంధనలను మార్చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై వరస విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విమర్శల పరంపరను మంగళవారం కూడా కొనసాగించారు. ప్రధానమంత్రి తన దుస్తులు మార్చినట్లుగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను మారుస్తోందంటూ అటు ప్రధానిపైన, ఇటు ఆర్‌బిఐపైన ఏకకాలంలో విమర్శలు చేశారు. రోజంతా పలు ర్యాలీల్లో మాట్లాడడానికి ప్రధాని మోదీ వేర్వేరు దుస్తులు మార్చినట్లుగా ఆర్‌బిఐ ఇష్టారాజ్యంగా రోజుకో నిబంధన మారుస్తూ పోతోందని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విమర్శించారు. డిసెంబర్ 30 లోగా ఒక్కసారి మాత్రమే రద్దయిన కరెన్సీని 50 వేలకు పైగా డిపాజిట్ చేయవచ్చంటూ విధించిన ఆంక్షను ఎత్తివేయాలని ఏఐసిసి డిమాండ్ చేసిన అనంతరం రాహుల్ గాంధీ ప్రధానిపై ఈ విమర్శలు చేశారు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఆర్‌బిఐ ప్రకటించిన నిబంధనలపై ట్విట్టర్‌లో ఒక వ్యాసాన్ని ఉంచిన రాహుల్ గాంధీ ‘ప్రధాని తన దుస్తులు మార్చినట్లుగా ఆర్‌బిఐ నిబంధనలను మార్చివేస్తోంది’ అని విమర్శించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు రాహుల్ గాంధీ పలు సభల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. సోమవారం యుపిలో ఈ ఇద్దరూ వేర్వేరు సభలో పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోదీ స్వరాష్టమ్రైన గుజరాత్‌లోని మెహసానాలో బుధవారం జరిగే ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ మరోసారి నోట్ల రద్దు అంశంపై మాట్లాడే అవకాశముంది.
ఎవరి మాట నమ్మాలి: చిదంబరం
కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా ఆర్‌బిఐ తాజాగా విధించిన ఆంక్షలపై మండిపడ్డారు. అటు ఆర్‌బిఐ, ఇటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పొంతన లేని ప్రకటనలతో దేశ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఆర్‌బిఐ ఒక మాట చెబితే, జైట్లీ మరో మాట చెప్తున్నారని, ఎవరిని నమ్మాల్లో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. నవంబర్ 8న ప్రధాని, నవంబర్ 11న జైట్లీ ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతూ ఆర్‌బిఐ కొత్త ఆంక్షలు విధించిందని, ఆ వెంటనే ఆర్థికమంత్రి దీనికి భిన్నంగా మరో ప్రకటన చేశారని అన్నారు. ‘ప్రజలు అసలు ఎవరిని నమ్మాలి? ఆర్థిక మంత్రినా, ఆర్‌బిఐనా? విశ్వసనీయత ఉండాల్సిన అవసరం లేదా?’ అని చిదంబరం ప్రశ్నించారు.
వ్యక్తిగత విమర్శలు మానండి: బిజెపి
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బిజెపి అది కాంగ్రెస్, గాంధీ కుటుంబం సంస్కృతికి అద్దం పడుతోందని ధ్వజమెత్తింది. అంతేకాదు, రాహుల్ గాంధీ వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోకపోతే, తేనెతుట్టెను కదిపినట్లవుతుందని బిజెపి జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ హెచ్చరించారు. ‘ప్రధానికి వ్యతిరేకంగా ‘ముర్దాబాద్’లాంటి నినాదాలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని సోమవారం రాహుల్ గాంధీ అన్నారు. అయితే 24 గంటలు తిరక్క ముందే ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ పద్ధతి మానుకోకపోతే ఆయన తేనెతుట్టెను కదిపినవారవుతారని హెచ్చరిస్తున్నాను’ అని సింగ్ అన్నారు.

చిత్రం.. రాహుల్ గాంధీ