జాతీయ వార్తలు

భూకంపం రాలేదే!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, డిసెంబర్ 22: తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఎద్దేవా చేశారు. ‘వాళ్లకు( కాంగ్రెస్ పార్టీకి) ఒక యువ నాయకుడున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకున్నారు. ఆయన మాట్లడడం నేర్చుకున్నప్పటినుంచీ నా సంతోషానికి ఎల్లలు లేవు. నేను మాట్లాడితే భూకంపం వస్తుందని ఆయన ఊరూరా తిరిగి చెప్పుకొంటున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడారు కానీ భూకంపం రాలేదు. ఆయన మాట్లాడకపోయి ఉంటేనే భూకంపం వచ్చేదేమో’ అని రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా ప్రధాని అన్నారు. ఒక వేళ ఆయన మాట్లాడకపోయి ఉంటే భూకంపం వచ్చి ఉండేదని, జనం పదేళ్ల పాటు దాన్ని భరించాల్సి వచ్చేదని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడారు కాబట్టి ఇక ఇప్పుడు భూకంపం వచ్చే అవకాశమే లేదని మనం నిర్భయంగా ఉండవచ్చని కూడా ప్రధాని అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహారా, బిర్లా కంపెనీలనుంచి ముడుపులు అందుకున్నారని రాహుల్ గాంధీ బుధవారం గుజరాత్‌లోని మెహసానాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆరోపించిన విషయం తెలిసిందే. మోదీ వ్యక్తిగత అవినీతిని బైటపెడతానన్న భయంతోనే తనను పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకున్నారని కూడా రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని రాహుల్‌పై చురకలు వేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి గురువారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. బనారస్ హిందూ యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న కారణంగా కార్డులు, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న రాహుల్ వ్యాఖ్యలను సైతం ప్రధాని తప్పుబట్టారు. ‘చదవడం, రాయడం వచ్చిన వారిని నిరక్షరాస్యులుగా చేయడానికి నేను ఏదో గారడి చేశానని ఆయన చెప్పనందుకు సంతోషిస్తున్నాను. ఆయన మాట్లాడడానికి ముందు ఎప్పుడూ ఆలోచించరు. అంతేకాదు తమ పార్టీ సుదీర్ఘ పరిపాలన వైఫల్యాన్ని తాను అంగీకరించాననే విషయాన్ని సైతం ఆయన గ్రహించలేదు’ అని కూడా మోదీ అన్నారు.

చిత్రం..వారణాసిలో గురువారం మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని మోదీ