జాతీయ వార్తలు

255 పార్టీల గుర్తింపు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12 పార్టీలతోపాటు దేశంలోని మొత్తం 255 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. 2005 నుంచి 2015 వరకూ పదేళ్ల కాలంలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు కనుక వీటి గుర్తింపు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గత రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘గుర్తింపు రద్దు చేసిన రాజకీయ పార్టీలు చాలాకాలంగా పని చేయటం లేదు. కొన్ని పార్టీల చిరునామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి’ అని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగు దేశం, చిత్తూరుకు చెందిన అఖిల భారత సద్గుణ, హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రనాడు, బహజన్ రిపబ్లికన్, భారతీయ సేవాదళ్, జై తెలంగాణ, ముదిరాజ్ రాష్ట్రీయ సమితి, నేషనల్ సిటిజన్, సత్యయుగ్, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ ప్రజా పార్టీల గుర్తింపు రద్దయ్యింది. ఇదిలావుంటే ఢిల్లీకి చెందిన అఖిల భారత ప్రొగ్రెస్సివ్ జనతాదళ్ పార్టీ చిరునామా అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ నివసిస్తున్న అక్బర్ రోడ్డులోని 17 నెంబర్ ఇంటి చిరునామాతో అఖిల భారత ప్రొగ్రెస్సివ్ జనతాదళ్ పార్టీ రిజిస్టర్ అయి ఉంది. రాజ్‌నాథ్ సింగ్ ఈ ఇంటికి మారకముందు కాంగ్రెస్ ఎంపీ, సినీనటుడు చిరంజీవి మంత్రిగా ఉన్నప్పుడు ఇందులోనే ఉండేవారు. ఢిల్లీలోని పటియాలా సివిల్ కోర్టు చిరునామాతో మరో పార్టీ రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. అఖిల భారతీయ దస్తకార్ మోర్చా పేరిట ఎప్పుడో రిజిస్టర్ అయిన ఈ పార్టీ తమ చిరునామాగా కొత్త ఢిల్లీలోని పటియాలా కోర్టు సమూహంలోని 187 చాంబర్‌ను సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన 255 రాజకీయ పార్టీల్లో ఎక్కువ శాతం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలకు చెందినవి కావటం గమనార్హం.