జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, డిసెంబర్ 27: ఉత్తరాఖండ్‌ను అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడం ద్వారా ఉపాధి అవకాశాలు లేక ఇక్కడి యువత వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చేయాలన్నదే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మంగళవారం ఆయన 12,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న చార్‌ధామ్ హైవే అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇక్కడి పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ మహార్యాలీలో ప్రసంగించారు. 900 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల చార్‌ధామ్ యాత్రికులు అన్ని కాలాల్లోను ఎలాంటి ఇబ్బందీ లేకుండా చార్‌ధామ్‌లుగా పిలవబడే బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌లను సందర్శించడానికి వీలవుతుందని ప్రధాని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఉత్తరాఖండ్‌ను బయటకు లాగి తీరుతానని ఆయన హామీ ఇస్తూ, అయితే దీనికి డబుల్ ఇంజన్ కావాలని, ఒక ఇంజన్ కేంద్రంలో, రెండోది రాష్ట్ర రాజధానిలో ఉండాలని అన్నారు. 2017లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించడం ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజపేయి కలలను సాకారం చేయడానికి తమ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. చార్‌ధామ్ హైవే ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్రికుల్లో తమ భద్రతకు సంబంధించి ఉండే భయాలను పోగొట్టడం ద్వారా రాష్ట్రానికి జీవనాడి అయిన పర్యాటక రంగానికి ఊపునిస్తుందని ఆయన చెప్పారు.
దేశంలోని అన్ని గ్రామాలకు వెయ్యి రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లు ఆయన చెప్పారు. లక్షలాది మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మహిళలకు పొగనుంచి విముక్తి కల్పించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం హయాంలోనే ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ పథకాన్ని అమలు చేసినట్లు ఆయన చెప్పారు. దీనికోసం బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించామని, ఇప్పటికే 6 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
అంతకుముందు ప్రధాని సమక్షంలో చార్‌ధామ్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానితోపాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, అజయ్ టమ్టా, రాష్ట్రానికి చెందిన పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..డెహ్రాడూన్‌లో మంగళవారం చార్‌దామ్ రాజ్‌మార్గ్ వికాస్ పరియోజన ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరాఖండ్ గవర్నర్ కె.కె.పాల్, ముఖ్యమంత్రి హరీశ్ రావత్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్