జాతీయ వార్తలు

మోదీ సమాధానం చెప్పి తీరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పెద్దనోట్ల రద్దు తన లక్ష్యాన్ని సాధించటంలో విఫలమైందని, నోట్లరద్దు తరువాత అవినీతి మరింత పెరిగిందని, ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, జెడి (ఎస్), ఆర్‌జెడి, జెఎంఎం, ఏఐయుడిఎఫ్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. మోదీపై సహారా, బిర్లా డైరీల్లో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. యాభై రోజుల తరువాత నోట్ల పంపిణీ యథాతథం కాకపోతే నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏ లక్ష్య సాధన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనేది మోదీ ఇప్పటికైనా బైట పెట్టాలన్నారు.
పెద్ద నోట్ల పర్యవసానంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం ప్రతిపక్ష పార్టీల నాయకులకు తేనేటి విందు ఇచ్చారు. అయితే ఈ సమావేశానికి టిఎంసి, ఆర్‌జెడి, జెఎంఎం, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు మాత్రమే హాజరయ్యారు. వామపక్షాలు, సమాజ్‌వాదీ, జెడి (యు) తదితర పెద్ద పార్టీల నాయకులు హాజరు కాలేదు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ తదితర నాయకులు మొదట ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపిన అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.
నల్లధనం, అవినీతిని అంతమొందించేందుకే పెద్ద నోట్లను రద్దు చేశానని చెబుతున్న మోదీ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పటం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆదిత్య బిర్లా, సహారా డైరీల్లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముడుపులు చెల్లించినట్లు వెల్లడైందని, ఈ ఆరోపణలకు ఆయన ఎందుకు సమాధానం చెప్పటం లేదని నిలదీశారు. పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి మరింత పెరిగిందని, నోట్ల మార్పిడి కోసం సరికొత్త అవినీతి వ్యవస్థ రూపుదిద్దుకున్నదని ఆయన ఆరోపించారు. యాభై రోజుల తరువాత నోట్ల పంపిణీ మామూలవుతుందని, లేకపోతే తనను ప్రశ్నించాలని మోదీ ప్రకటించటం గురించి ప్రస్తావిస్తూ మూడు రోజుల తరువాత పరిస్థితి బాగుపడకపోతే మోదీ ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు విఫలమైనందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. జైన్ డైరీ కుంభకోణంలో బిజెపి సీనియర్ నాయకుడు అద్వానీ రాజీనామా చేయటం గురించి ప్రస్తావిస్తూ సహారా, బిర్లా డైరీ వివరాలకు మోదీ నైతిక బాధ్యత వహించరా? అని ప్రశ్నించారు.
పెద్దనోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణమని, దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు వలన దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆమె దుయ్యబట్టారు. మోదీ తెస్తానన్న మంచి రోజులు ఇవేనా అని నిలదీశారు. తమిళనాడు ప్రధాన కార్యదర్శి నివాసం, కార్యాలయంపై ఆదాయం పన్ను అధికారులు దాడి చేయటం వలన కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు దెబ్బ తగిలిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు సిఆర్‌పిఎఫ్‌ను దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. పెద్దనోట్లరద్దుపై పార్లమెంటు ఆమోదం ఎందుకు తీసుకోలేదని ఆమె నిలదీశారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం చట్ట విరుద్ధమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రజా వ్యతిరేక చర్య అని, ఇది సగటు మనిషిని అష్టకష్టాల్లో పడవేసిందని ఆర్‌జెడి, డిఎంకె నేతలు దుయ్యబట్టారు.

చిత్రం..ఢిల్లీలో మంగళవారం విలేఖరుల సమావేశంలో రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ