జాతీయ వార్తలు

ఎందుకంత గోప్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 29: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంపై చెలరేగుతున్న అనుమానాలకు మద్రాసు హైకోర్టు గురువారం చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. చివరి క్షణం వరకూ కోలుకుంటున్నారంటూ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో జయలలిత ఆకస్మికంగా మరణించడంపై తమకూ అనుమానాలున్నాయని న్యాయమూర్తులు ఎస్ వైద్యనాథన్,పార్థిబన్‌లతో కూడిన హైకోర్టు సెలవుకాలపు బెంచి పేర్కొంది. ఇన్ని అనుమానాలు, సందేహాల నేపథ్యంలో జయ మృత దేహాన్ని వెలికి తీయాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియజేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. జయ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో వెల్లడించకుండా అంతా గోప్యం అన్న ధోరణితో వ్యవహరించడం పట్ల న్యాయమూర్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 75రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం జయలలిత మరణించారంటూ ఈ నెల 5న ప్రకటన వెలువడింది. ఆమె మృత దేహాన్ని మెరీనా బీచ్‌లోని ఎంజిఆర్ సమాధి వద్ద ఖననం చేశారు. అన్నాడిఎంకె కార్యకర్త పిఎ జోసఫ్ దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్ విచారణకు చేపట్టిన హైకోర్టు బెంచి జయ మరణానికి ముందు ఆమె ఆరోగ్యానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన ప్రకటనలను ఉటంకించింది. ‘జయలలిత కోలుకుంటున్నారు. భోజనం చేస్తున్నారు. అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. చివరికి అధికారిక సమావేశాలూ నిర్వహిస్తున్నట్టుగా పత్రికల్లో కథనాలను మేమూ చూశాం. అయినా ఆమె ఆకస్మికంగా మరణించారు’అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పైగా జయ మృత దేహాన్ని రెవిన్యూ డివిజన్ అధికారి ఎవరూ చూడలేదని, వైద్య పరమైన నివేదికలనూ సమర్పించలేదని తెలిపారు. జయ మరణించిన ఇన్ని వారాల తర్వాతైనా అందుకు సంబంధించిన అనుమానాలను తొలగిస్తూ ఆధారాలను ఎందుకు బయట పెట్టడం లేదంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1980దశకంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌జి రామచంద్రన్ మరణించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని పేర్కొన్నారు. చెన్నైలోనూ, అమెరికాలోనూ ఎమ్‌జిఆర్ చికిత్స పొందారని, అందుకు సంబంధించిన వీడియోలను అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాగా, ఈ అంశంపై వాదించిన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఆర్ ముత్తుకుమారస్వామి మాట్లాడుతూ హైకోర్టు తొలి బెంచి ఇలాంటి ప్రజాహిత పిటిషన్‌నే విచారిస్తోందని, తదుపరి విచారణను జనవరి నాలుగో తేదీకి వాయిదా వేసిందని కోర్టుకు నివేదించారు. ఇదే అంశంపై మరో ప్రజాహిత పిటిషన్ సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు వస్తోందని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు బెంచి కేసు తదుపరి విచారణను జనవరి తొమ్మిదికి వాయిదా వేశారు.

చిత్రం..జయలలిత పార్థివదేహం (ఫైల్‌ఫొటో)