జాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: కేంద్ర ఎన్నికల సంఘం రెండు మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజులుగా ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి డాక్టర్ నసీం జయిదీ, కమిషనర్లు ఏకె జోటి, ఓం ప్రకాశ్ రావత్‌లు సోమవారం కేంద్ర హోంశాఖ, సిఆర్‌పిఎఫ్, రైల్వే బోర్డు చైర్మన్‌తో సమావేశమై ఐదు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతా దళాల మోహరింపు అంశంపై చర్చించారు. అల్లర్లు, దాడులు జరిగేందుకు అవకాశమున్న పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపుపై వారు దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ మధ్య నెలకొన్న గొడవలు ఏమేరకు శాంతి భద్రతలను దెబ్బతీస్తాయి? ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతా దళాల మోహరింపు ఎలా ఉండాలనేది చర్చించినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రాల వద్దకు భద్రతా దళాల తరలింపు, ఓటింగ్ బాక్స్‌ల తరలింపునకు చేపట్టిన ఏర్పాట్లపై రైల్వే బోర్డు చైర్మన్ వివరించారని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల పోలింగ్ ఎన్ని దశల్లో వుంటే భద్రతా దళాల మోహరింపు బాగుంటుందనే అంశంపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ఇదిలావుంటే కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, సీనియర్ పోలీసు అధికారులతో మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఓటర్ల తుది జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతా దళాల మోహరింపు గురించి తుది చర్చలు జరుపనుంది. మంగళవారం కీలక చర్చలు ముగించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు సంబంధించిన ప్రకటన చేస్తుందని అంటున్నారు.