జాతీయ వార్తలు

ఆ అధికారం హైకోర్టుకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: కోర్టు ధిక్కారం కేసులో నలుగురు జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నలుగురు జర్నలిస్టులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైకె సభర్వాల్ గురించి ఒక టాబ్లాయిడ్‌లో వార్తాకథనాలు ప్రచురించినందుకు ఢిల్లీ హైకోర్టు 2007లో ఈ నలుగురు జర్నలిస్టులను కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు నిర్ధారించింది. అయితే పై న్యాయస్థానానికి సంబంధించిన ధిక్కార పిటిషన్‌ను విచారించి తీర్పు ఇచ్చే అధికారం ఢిల్లీ హైకోర్టుకు లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎఎం ఖన్‌వికర్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సుప్రీంకోర్టును ఎవరైనా ధిక్కరిస్తే రాజ్యాంగంలోని 129వ అధికరణం కింద వారిని శిక్షించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకే ఉందని పేర్కొంటూ, ఒకవేళ సుప్రీంకోర్టు ఆ అధికారాన్ని వినియోగించుకోకపోతే, హైకోర్టు వంటి సబార్డినేట్ కోర్టులు ఆ పని చేయడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని 215వ అధికరణం కింద హైకోర్టుకు తనంత తానుగా గాని ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే గాని కోర్టు ధిక్కారం కింద విచారించే అధికారం ఉన్నప్పటికీ, తనకన్నా ఉన్నతస్థాయి కోర్టుకు సంబంధించిన కోర్టు ధిక్కార పిటిషన్లను విచారించి శిక్షించే అధికారం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తన 14 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నలుగురు జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ప్రస్తుతం మూతపడి ఉన్న గతంలో ఢిల్లీ నుంచి వెలువడిన ఒక టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన వార్తాకథనాలపై అప్పట్లో ఢిల్లీ హైకోర్టు తనంత తానుగా స్పందించి నలుగురు జర్నలిస్టులపై కోర్టు ధిక్కార విచారణ ప్రక్రియను చేపట్టింది. కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా నిర్ధారించిన హైకోర్టు శిక్షలను ఖరారు చేయడానికి న్యాయస్థానం ముందు హాజరుకావాలని 2007 సెప్టెంబర్ 11న ఆ నలుగురు జర్నలిస్టులను ఆదేశించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సవాలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం హైకోర్టులో విచారణ ప్రక్రియను నిలిపివేసింది.