జాతీయ వార్తలు

జడ్జీల బదిలీలపై ఏంచేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: కొలీజియం సిఫార్సులు చేసిన తరువాత కూడా హైకోర్టు న్యాయమూర్తులను ఎందుకు బదిలీ చేయటం లేదని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బదిలీకి సిఫార్సు అయిన తరువాత కూడా సదరు న్యాయమూర్తులను అదేస్థానంలో కొనసాగించటం వల్ల తప్పుడు ఊహాగానాలకు, అపార్థాలకు తావిచ్చినట్లవుతుందని అత్యున్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది. ‘బదిలీ చేయాలంటూ ప్రతిపాదనలు చేసిన తరువాత కూడా ఆయా న్యాయమూర్తులను కొనసాగించటం తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది. మీకు (కేంద్రానికి) ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ప్రతిపాదనలను వెనక్కి పంపండి. మేం వాటిని పరిశీలిస్తాం. అంతేకానీ, దాన్ని ఇలా నాన్చి పెట్టడం వల్ల ప్రయోజనం లేదు’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో అన్నారు. జస్టిస్ ఠాకూర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. కొలీజియం జడ్జిల బదిలీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించి పది నెలలు కావొస్తోందని, ఇంతకాలంగా ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కొలీజియం మొత్తం 37మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని ప్రతిపాదించిందని, ప్రభుత్వం వాటిని పరిశీలిస్తోందని ఆయన పేర్నొన్నారు. బదిలీలకు సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద లేదని, మూడు వారాలు సమయమిస్తే పూర్తి వివరాలను కోర్టుకు సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ మాట్లాడుతూ, ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి వద్ద సమాచారం లేకపోవటం ఏమిటని ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఆర్. షా పేరు బదిలీల జాబితాలో ఉన్నప్పటికీ ఆయనను కొనసాగించటంలో ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏమిటని నిలదీశారు. మరో సీనియర్ న్యాయవాది యతిన్ ఓఝా మాట్లాడుతూ ‘పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఓపెన్‌కోర్టులో మీడియా, జర్నలిస్టుల సమక్షంలో చాలా విషయాలు చెప్పలేను. న్యాయవ్యవస్థ ప్రయోజనాలను, గౌరవాన్ని కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేయాల్సి ఉంది’ అని ఆయన అన్నారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ బదిలీల ప్రతిపాదనల పెండింగ్ కారణాలపై రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పిస్తానని వెల్లడించారు.