జాతీయ వార్తలు

ఎమ్సెట్-2 లీకేజీ కేసు..ప్రధాన నిందితుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ప్రధాన నిందితుడు కమలేశ్వర్ కుమార్ సింగ్ (55) మృతి చెందాడు. బిహార్‌కు చెందిన కమలేశ్వర్ కుమార్ ప్రస్తుతం సిఐడి కస్టడీలో ఉన్నాడు. సిఐడి కస్టడీలో ఉండగానే అతను అస్వస్థకు గురయ్యాడని, వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని సిఐడి అధికారులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. కాగా నిందితుడి మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టి-ఎమ్సెట్ కుంభకోణంలో కీలక సూత్రధారి కమలేశ్వర్ కుమార్ సింగ్ మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. అతని అరెస్టుకు ముందు దాదాపు 50 మందిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణ పోలీసులు 22 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం జూలై మాసంలో టి-ఎమ్సెట్ ప్రశ్నపత్రం లీకైంది. ప్రశ్నపత్రం లీకేజీతో దేశవ్యాప్తంగా 220 మంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు చేరాయి. అభ్యర్థుల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటకకు చెందిన వారే అధికంగా ఉన్నారు.
ఇదిలావుండగా టి-ఎమ్సెట్ ప్రశ్నపత్రం లీక్ అయిన నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు కమలేశ్వర్ కుమార్ సింగ్‌ను నాలుగు రోజుల క్రితమే సిఐడి అధికారులు పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని అక్కడి కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇక్కడి నాంపల్లి కోర్టులో హాజరుపరచి సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం విచారణ సమయంలో నిందితుడు కమలేశ్వర్ కుమార్ అస్వస్థతకు గురవ్వడంతో మహావీర్ అసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చామని, చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితి విషమిస్తున్నా సరైన వైద్య అందకపోవడం వల్లే కమలేశ్వర్ కుమార్ మృతి చెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న అధికారుల మెడకు కమలేశ్వర్ మృతి వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మృతి చెందిన కమలేశ్వర్ పాట్నాలో న్యాయవాదిగా పనిచేస్తున్నట్టు తెలిసింది.