జాతీయ వార్తలు

కోడి పందేలపై స్టేకు సుప్రీం నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6:ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, వస్తువుల్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉందంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని మాత్రం నిలుపుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కోడి పందేలను రద్దుచేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు, ఓలేటి రాజు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్‌సింగ్ కేహర్, జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సంక్రాంతి సమయంలో కోడి పందేలు నిర్వహించడం కొన్ని శతాబ్దాలుగా జరుగుతోందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆదినారాయణ, గల్లా సతీశ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కోడి పందేలు కేవలం ఆట మాత్రమేనని జూదం కాదని వాదన వినిపించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక జాతికి చెందిన కోళ్లను పెంచుతారని, ఆయితే వాటిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని చెబుతూ అందుకు సాక్ష్యంగా పత్రికల్లో ప్రచురితమైన ఫోటోలను కోర్టుకు అందజేశారు. సామాన్యుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి కోళ్లను అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని వాదించారు. ధర్మాసనం ఈ సందర్భంగా కోళ్లను అదుపులోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, వస్తువుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చునంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. కాగా ఏపీలోని పలు ప్రాంతాలలో ఎక్కడపడితే అక్కడ కోడి పందేలు నిర్వహిస్తారని జంతు సంరక్షణ సంస్ధ తరపున సీనియర్ న్యాయవాది అంజలి శర్మ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చివరగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఇచ్చిన మొత్తం తీర్పుపై స్టే విధించడం లేదని, కేవలం కోళ్లను అదుపులోకి తీసుకోవడం అనే అంశంపై మాత్రమే స్టే విధిస్తున్నామని పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.