జాతీయ వార్తలు

గుట్టలుగా పేరుకుపోతున్న కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: దేశ వ్యాప్తం గా వివిధ హైకోర్టుల్లో తీవ్రమైన న్యాయమూర్తుల కొరత వల్ల పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 24 హైకోర్టుల్లో కలిపి మొత్తం 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. 24 హైకోర్టులు సుమారు 44 శాతం న్యాయమూర్తుల కొరతతో నడుస్తున్నాయి. ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పోరు సాగుతున్నప్పటికీ ఈ కొరతను తీర్చడానికి మాత్రం అడుగులు ముందుకు పడ టం లేదు. సుప్రీంకోర్టు జారీ చేసిన ‘్భరత న్యాయ వ్యవస్థ వార్షిక నివేదిక 2015-16’లో విస్మయపరిచే ఈ గణాంకాలు ఉన్నాయి. నిరుడు జూన్ 30నాటికి సేకరించిన గణాంకాల ప్రకారం హైకోర్టుల్లో మొత్తం మంజూరయిన న్యాయమూర్తుల పోస్టులు 1,079 కాగా, కేవలం 608 మంది న్యాయమూర్తులు మాత్రమే పనిచేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. అంటే హైకోర్టుల్లో మంజూరయిన పోస్టులతో పోలిస్తే పని చేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 43.65 శాతం మాత్రమేనని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. నిరుడు జూన్ 30 నాటికి అన్ని హైకోర్టుల్లో కలిపి పెండింగ్‌లో ఉన్న 40.54 లక్షల కేసుల్లో 29,31,352 సివిల్ కేసులు, 11,23,178 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 7,43,191 వ్యాజ్యా లు దశాబ్ద కాలానికి పైగా పాతవి కావడం విశేషం. భారత ప్రజాస్వామ్యంలోని రెండు వ్యవస్థల మధ్య ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామక అంశం వివాదానికి కారణంగా మారింది. ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించకుండా న్యాయ వ్యవస్థను స్తంభింపచేయజాలదని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి తెలిపింది. అయితే తమ ప్రభుత్వం 126 మంది న్యాయమూర్తులను నియమించిందని, 1990 నుంచి అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం పేర్కొన్నారు.
హైకోర్టులన్నింటిలో అలహాబాద్ హైకోర్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం మంజూరయిన పోస్టుల్లో సగానికన్నా తక్కువ మంది న్యాయమూర్తులతోనే ఈ హైకోర్టు నడుస్తోంది. దీంతో ఈ హైకోర్టులో 9.24 లక్షలకు పైగా కేసులు పేరుకుపోయాయి. వీటిలో 3,09,634 కేసులు దశాబ్దానికి పైగా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో అలహాబాద్ హైకోర్టులోనే అత్యధిక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ హైకోర్టులో మంజూరయిన పోస్టులు 160 కాగా, కేవలం 78 మంది న్యాయమూర్తులు మాత్ర మే ఉన్నారు. ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్న హైకోర్టుల్లో మద్రాసు హైకోర్టు రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 3,02,846 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ హైకోర్టులో 75 పోస్టులు ఉండగా, 38 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. బొంబాయి హైకోర్టులో 2,98,263 కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 53,511 వ్యా జ్యాలు పదేళ్ల క్రితం నాటివి. ఈ హైకోర్టులో 94 మంది జడ్జీలు పనిచేయవలసి ఉండగా, 64 మంది మాత్రమే ఉన్నారు. శాతం రీత్యా చూస్తే చత్తీస్‌గఢ్ హైకోర్టు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కేవలం సుమారు 37 శాతం మంది న్యాయమూర్తులతోనే ఇది నడుస్తోంది. 22 పోస్టులకు గాను కేవలం ఎనిమిది మంది న్యాయమూర్తులే పనిచేస్తున్నారు. ఈ హైకోర్టులో 54,094 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.