జాతీయ వార్తలు

అఖిలేశ్‌పై పోటీకి సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి అండగా నిలబడిన ముస్లిం మతస్థుల పట్ల ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని, తన సూచనను పట్టించకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పోటీకి దిగుతానని అఖిలేశ్ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో ఏ వర్గానికి సైకిల్ గుర్తును కొనసాగించాలన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండటంతో, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనే అయినప్పటికీ తమ పోరాటం న్యాయస్థానం ముందుకెళ్లడం ఖాయమని ములాయం చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కుమారుడిపై విమర్శలు సంధించారు. ‘ముస్లింలకు ఎప్పుడూ అండగా నిలబడుతూ వారి ప్రయోజనాలను కాపాడుతున్నా. గతంలో నేను రాష్ట్ర డిజిపి పదవిలో ముస్లిం మతస్థుడిని నియమించాలనుకున్నప్పుడు 15 రోజుల పాటు అఖిలేశ్ నాతో మాట్లాడలేదు. ఆ పదవిలో ముస్లింలు ఉండటం ఆయనకు ఇష్టం లేదు. ఇది ఆ సామాజిక వర్గానికి వ్యతిరేక సందేశాన్ని పంపింది’ అని ములాయం పేర్కొన్నారు. బిజెపి కనుసన్నల్లో నడుస్తున్న పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ చేతిలో అఖిలేశ్ కీలుబొమ్మగా మారాడని ఆయన ఆరోపిస్తూ, ముస్లింలకోసం జీవిస్తానని, అవసరమైతే వారికోసం మరణిస్తానని, ఆ సామాజికవర్గ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో అఖిలేశ్‌తో పోరాడేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
తారస్థాయికి ఎస్‌పి రాజకీయాలు
సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన ఆధిపత్యపోరు పరాకాష్ఠకు చేరుకుంది. ఎన్నికల గుర్తు సైకిల్‌కోసం ఎస్‌పి వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. అంతకు ముందు పోటీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సంతకాలు సేకరించాయి. ఇదిలా కొనసాగుతుండగా సోమవారం లక్నో పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షుల పేరుతో కొత్త నేమ్ ప్లేట్‌లు దర్శనమిచ్చాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ పేరుతో ఓ నేమ్‌ప్లేట్ అంతకు ముందే ఉండేది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అంటూ నేమ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. ములాయం సింగ్ యాదవ్ నేప్ ప్లేట్‌కు కుడివైపున కింద ఎస్‌పి జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అంటూ నేమ్ ప్లేట్ పెట్టేశారు. తండ్రీ కొడుకుల మధ్య సయోధ్యకోసం పలు దఫాలు చర్చలు సాగినా ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీలో తలెత్తిన సంక్షోభం ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

చిత్రం..లక్నోలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న ములాయం సింగ్