జాతీయ వార్తలు

ఆందోళన తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/చెన్నై, జనవరి 19:జల్లికట్టుపై తమిళనాడు అట్టుడుకుతోంది. తమ ప్రాచీన సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ చేపట్టిన దీక్షలు మూడోరోజు గురువారమూ కొనసాగాయి. తమిళ సంఘాలు శుక్రవారం రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు డిఎంకె సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా జల్లికట్టుకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ గురువారం బంద్ పాటించింది. షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం నిరశన దీక్ష చేపట్టనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ ప్రకటించారు. మెరినా బీచ్‌వద్ద ప్రదర్శన చేపట్టిన వేలాదిమంది తమిళులు రాత్రయినా, ఇళ్లకు వెళ్లకుండా దీపాల వెలుగులో నిరసన కొనసాగించారు. మరోవైపు తమిళనాడు సిఎం పన్నీర్‌సెల్వం ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక, జల్లికట్టుపై తమిళులకు సానుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు.
జల్లికట్టు వివాదం ముదురుతున్న నేపథ్యంలో సిఎం పన్నీర్ సెల్వం బుధవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. జల్లికట్టు నిర్వహించేందుకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ ఆయన గురువారం ఉదయం ప్రధానిని కలిసి విన్నవించారు. అయితే ఈ వ్యవహారం సుప్రీం పరిశీలనలో ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏమీ చేయజాలమని, తీర్పు వచ్చాక తమిళుల సంస్కృతిని కాపాడేందుకు చర్యలు చేపడతామని మోదీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ‘జల్లికట్టు నిర్వహణకు అవసరమైన చర్యలను త్వరలోనే తీసుకుంటాం.. ఇందుకు కేంద్రం నుండి సహకారం ఉంటుంద’ని సెల్వం విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
కాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం సాధ్యాసాధ్యాలను బట్టి జల్లికట్టు నిర్వహణకోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. తమిళనాడులో బిజెపికి సానుకూల వాతావరణం సృష్టించుకునేందుకు ఇదే సరైన అదను అని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు జల్లికట్టుపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసినా ఆశ్చర్యపోకూడదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులోని పరిస్థితులపై మోదీ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన జల్లికట్టుపై కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలించినట్లు చెబుతున్నారు.
జల్లికట్టు నిర్వహించేందుకు అనుమతి ఇప్పించాలని అన్నా డిఎంకె ఎంపిలు రేపు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కోరనున్నారు. ఈ మేరకు వారు ప్రణబ్ ముఖర్జీకి ఒక వినతిపత్రం ఇవ్వనున్నారు.
కాగా జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మూడో రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మెరీనా బీచ్ వద్ద వేలాది మంది ప్రదర్శనలు చేశారు. డిమాండ్లు ఆమోదించే వరకూ ఆందోళన కార్యక్రమాలు విరమించబోమని నిరసనకారులు ప్రకటించారు. జల్లికట్టుకు కేంద్రమైన అలన్గనల్లూర్ నిరసనలతో అట్టుడికింది. వందలాది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళ విద్యార్థులు నిరసన తెలిపారు. కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినందున ఆందోళన విరమించాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తుందని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఆందోళనకారులకు హామీ ఇచ్చారు.
సాంస్కృతిక చిహ్నం: విశ్వనాథన్ ఆనంద్
జల్లికట్టు తమిళుల సాంస్కృతిక చిహ్నమని చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పష్టం చేశారు. ఆందోళనలకు గురువారం ఆయన మద్దతు ప్రకటించారు. ‘జల్లికట్టు తమిళుల సాంస్కృతిక చిహ్నం. దాన్ని అందరూ గౌరవించాలి. నాతోపాటు అందరూ జంతు ప్రేమికులమే. అయినప్పటికీ తమిళుల సంప్రదాయాలను, జీవన విధానాన్ని గౌరవించాల్సి ఉంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
బంద్‌కు డిఎంకె మద్దతు
పుదుచ్చేరి: జల్లికట్టుకు మద్దతుగా తమిళ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపునకు డిఎంకె, జనతాదళ్ (యు), సిపిఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బంద్‌కు సహకరిస్తామని ఇంతకు ముందే ప్రకటించింది.

చిత్రం..జల్లికట్టు నిషేధాన్ని నిరసిస్తూ మెరీనాబీచ్ వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులు