జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: దేవతలు విహరించే దేవభూమిగా పేరు గాంచిన ఉత్తరాఖండ్‌లో అధికారం కోసం కాంగ్రెస్, బిజెపి హోరాహోరీగా పోరాడుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఎలాగైనా అధికారంలోకి వచ్చి ప్రతిష్ట నిలబెట్టుకునేందుకు బిజెపి ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. 70 సీట్లున్న ఉత్తరాఖండ్ శాసనసభకు ఫిబ్రవరి 15న ఎన్నికలు జరుగనున్నాయి. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 32, బిజెపి 31 సీట్లు గెలుచుకుంటే 3 స్థానాల్లో బిఎస్‌పి, మరో 3 స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఒక స్థానంలో ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ అభ్యర్ధి గెలిచారు. రెండు ప్రధాన పార్టీల బలాబలాల మధ్య కేవలం ఒక సీటు మాత్రమే తేడా ఉండటంతో ఆ రాష్ట్రంలో ఫిరాయింపులు పెరిగి అధికారం చేతులు మారుతూ వచ్చింది. కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది శాసన సభ్యులను తమ వైపు తిప్పుకోవటం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గత ఏడాది బిజెపి చేసిన ప్రయత్నాలను కోర్టులు వమ్ము చేయటం తెలిసిందే. అందుకే బిజెపి ఇప్పుడు విజయమే ధ్యేయంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తోంది.
కాంగ్రెస్ నుండి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్న బిజెపి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులు ఎవరు ముందుకు వచ్చినా వారిని తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్‌డి.తివారీ కుమారుడు రోహిత్ శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి యశ్పాల్ ఆర్యాను పార్టీలో చేర్చుకున్న బిజెపి వారిని అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్ నుండి వచ్చిన దాదాపు పదిహేను మందికి బిజెపి టికెట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరాఖండ్‌లో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి నాయకత్వం తమ పార్టీ సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టి కాంగ్రెస్ నుండి వచ్చిన వారికి టికెట్లు కేటాయించి చరిత్ర సృష్టిస్తోంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ను బాగా వాడుకుంటోంది. మోదీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే మోదీ, బిజెపిని గెలిపిస్తే రాష్ట్రం రూపు రేఖలను మార్చివేస్తామని ప్రచా రం చేస్తోంది. అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని అందజేస్తామని హామీ ఇస్తోంది. రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న మాజీ ముఖ్యమంత్రి ఖండూరి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు బిజెపి వ్యూహన్ని దెబ్బ తీసేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్న ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులున కొనుగోలు చేయటం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతూ కాంగ్రెస్‌ను గెలిపించాలని రావత్ కోరుతున్నారు. ఆయితే రావత్‌కు పార్టీ సీనియర్ నాయకుల నుండే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయకు రావత్‌కు మధ్య కొనసాగుతున్న గొడవలు కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీస్తున్నాయి. బిజెపి రాష్ట్ర నాయకులు కలిసి కట్టుగా పనిచేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు పరస్పరారోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.
సర్వేల్లో బిజెపికి మొగ్గు
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే అంశంపై ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సర్వేలూ బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో బిజెపికి 35 నుంచి 43 సీట్లు, కాంగ్రెస్‌కు 22-30 సీట్లు వస్తాయని ఎబిపి సర్వే అంచనా వేయగా, ఏబిపి-సిఎస్‌డిఎస్ సర్వే కూడా ఇదే ఫలితాలు వస్తాయని సూచించింది. అలాగే బిజెపికి 41-46 సీట్లు, కాంగ్రెస్‌కు 18-23 సీట్లు, ఇతరులకు 2-6 సీట్లు వస్తాయని ఇండియాటుడే-ఆక్సిస్ సర్వే పేర్కొనగా, బిజెపికి 40 సీట్లు, కాంగ్రెస్‌కు 24 సీట్లు, ఇతరులకు 6 సీట్లు లభిస్తాయని విడిపి సర్వేలో తేలింది.