జాతీయ వార్తలు

కులాన్ని పట్టు.. ఓట్లు కొట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: దాదాపు ఇరవై రెండు కోట్ల జనాభాతో దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు కులాల సమీకరణ ద్వారా ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అధికార సమాజ్‌వాదీ, ప్రధాన ప్రతిపక్షమైన బహుజన్ సమాజ్‌వాదీ, మూడో స్థానంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా కులాల సమీకరణం ద్వారా ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నాలుగు పార్టీలు కూడా కులాలను దృష్టిలో పెట్టుకునే టికెట్ల కేటాయించటం గమనార్హం. యాదవ్-ముస్లిం, ఎస్‌సి-ముస్లిం, ఎంబిసి-ఉన్నత వర్గాల మద్దతుకు అదనంగా ఇతర వర్గాలకు చెందిన 5 నుంచి 7 శాతం ఓట్లు సంపాదించుకోవటం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు సమాజ్‌వాదీ, బిఎస్‌పి, బిజెపి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీతో సీట్ల సర్దుబాటు చేసుకోవటం ద్వారా తమ ఉనికిని కాపాడుకునేందుకు కిందా మీదా పడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ యాదవ్-ముస్లిం ఓట్లతోపాటు కొన్ని ఎంబిసి (మోస్ట్ బ్యాక్‌వర్డ్) వర్గాల ఓట్లు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం ద్వారా ముస్లింలకు మరింత విశ్వాసం కలిగించి ఆ ఓట్లను పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాయావతి తన ఓటు బ్యాంకు దళితులకు ముస్లిం ఓట్లను కలుపుకోవటంపాటు కొన్ని ఉన్నత వర్గాల ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. బిజెపి బ్రహ్మణ, వైశ్య తదితర ఉన్నత వర్గాల ఓట్లతోపాటు యాదవేతర వెనుకబడిన కులాల ఓట్లను కూడగట్టుకోవటం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సమాజ్‌వాదీ పార్టీని పట్టుకుని వేలాడడం ద్వారా తమ ఉనికిని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతోంది. ఈ నాలుగు పార్టీలు కూడా కులాల సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపిక చేసింది. సమాజ్‌వాదీ పార్టీ ప్రధానంగా యాదవ, ముస్లింలకు ఎక్కువ టికెట్లు కేటాయించింది. మాయావతి కూడా దళిత-ముస్లిం- కొన్ని ఉన్నత వర్గాల వారికి ఎక్కువ టికెట్లు ఇచ్చింది. బిజెపి కూడా తమ పద్ధతిలో ఉన్నత వర్గాలతోపాటు యాదవేతర బిసిలు, జాట్‌యేతర ఎస్‌సి ఉపకులాల వారికి టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మూడు పార్టీలు రాష్ట్భ్రావృద్ధి కంటే కులాల సమీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. సమాజ్‌వాదీ, బిఎస్‌పి, బిజెపిలు తమ ఎన్నికల ప్రణాళికల్లో అభివృద్ధి గురించి పలు హామీలు ఇచ్చినా అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే మాత్రం కులాల సమీకరణ వ్యూహానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. 403 శాసన సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో ఐదు ప్రాంతాలున్నాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో 84 సీట్లున్నాయి. ఇక్కడ దళితులు 17 నుంచి 28 శాతం ఉంటే ముస్లింలు 6 నుండి 40 శాతం మంది ఉన్నారు. బ్రాహ్మణులు 8 నుండి 10 శాతం వరకు ఉంటారు 30 శాతం ఉన్న వెనుకబడిన కులాల వారిలో యాదవులు, జాట్‌లు అధికం. బుందేల్‌ఖండ్‌లో 19 నియోజకవర్గాలున్నాయి. 19 నియోజకవర్గాల్లో దళితులు 27 నుంచి 32 శాతం వరకు ఉన్నారు. బ్రాహ్మణులు 9 నుండి 14 శాతం ఉంటే ముస్లింలు 6 నుంచి 8 శాతం వరకు ఉంటారు. మిగతా ప్రజానీకం బిసిలు. వీరిలో యాదవులు, కుర్మిలు, నిషాద్‌లు అధికంగా ఉంటారు. రోహిల్‌ఖండ్‌లో 52 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వీటిలో దళితులు 13 నుండి 23 శాతం వరకు ఉంటారు. ముస్లింలు 38 నుంచి 42 శాతం ఉంటే 30 శాతం మంది వెనుకబడిన కులాల వారు. మధ్య ఉత్తరప్రదేశ్‌లో 98 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దళితులు 19 నుంచి 25 శాతం ఉంటే ముస్లింలు 28 శాతం ఉంటారు. బ్రాహ్మణులు 8 నుంచి 12 శాతం ఉంటే మిగతా వారంతా వెనుకబడిన కులాల వారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 150 సీట్లున్నాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని 150 శాసన సభ నియోజకవర్గాల్లో కూడా దళిత, ముస్లింలు అధిక శాతంలో ఉన్నారు. ఇక్కడ దళితులు 19 నుంచి 23 శాతం వరకు ఉంటే ముస్లింలు వివిధ నియోజకవర్గాల్లో 8 నుంచి 27 శాతం వరకు ఉన్నారు. బ్రాహ్మణులు 6 నుంచి 14 శాతం వరకు ఉంటారు. మిగతా వారు బిసిలు కాగా ఇందులో కుర్మి, భూమిహార్లు, రాజ్‌బర్లు, యాదవుల సంఖ్య అధికం. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన బలం యాదవుల ఓట్లు. యాదవుల ఓట్లకు ముస్లిం ఓట్లను జత చేసుకోవటం ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అఖిలేష్ ఉవ్విళ్లూరు తున్నారు. కాంగ్రెస్‌తో సీట్లసర్దుబాటు చేసుకోవటం వలన ఆ పార్టీకి ఉన్న ఐదు శాతం ఓట్లతోపాటు ముస్లింల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముస్లింల ఓట్లు సంపాదించేందుకే అజీత్ సింగ్ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌డితో పొత్తు పెట్టుకునేందుకు నిరాకరించారు. ఇటీవల ముస్లింపై జరిగిన దాడుల వెనక జాట్‌లు ఉన్నందున అఖిలేశ్ జాగ్రత్తపడ్డారు. అందుకే ఆర్‌ఎల్‌డిని దూరంగా పెట్టారు.