జాతీయ వార్తలు

రక్షణ పాటవం.. సాంస్కృతిక సౌరభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో గురువారం నిర్వహించిన 68వ గణతంత్ర దినోత్సవాలు భారత సైనిక పాటవాన్ని, భిన్న సంస్కృతులను ప్రతిబింబించాయి. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ గణతంత్ర దినోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. తేలికపాటి వర్షం, మేఘావృతమైన వాతావరణం ప్రజల ఉత్సాహాన్ని, ఆసక్తిని అడ్డుకోలేకపోయాయి. రాజ్‌పథ్‌లో సుమారు గంటన్నర సేపు సాగిన గణతంత్ర దినోత్సవ కవాతును వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన 149 మంది సిబ్బంది కవాతు ఈ ఉత్సవాలలో ప్రత్యేకతగా నిలిచింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్‌కు చెందిన సిబ్బంది, వాయుసేన, నావికాదళం, ఆర్మీ దళాలు కవాతుకు నేతృత్వం వహించాయి. భారత్‌తో బలపడిన రక్షణ, భద్రతాబంధాన్ని ప్రదర్శిస్తూ గల్ఫ్‌నుంచి వచ్చిన 35 మంది వాద్యకారులు కవాతుకు ముందు పీఠిన నడిచారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి ఏర్పాటు చేసిన విశిష్ట భద్రతా సంస్థ నేషనల్ సెక్యూరిటి గార్డ్స్‌కు చెందిన ‘బ్లాక్ క్యాట్’ కమాండోలు మొట్టమొదటిసారిగా ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్నారు. దీంతో వీక్షకులు హర్షధ్వానాలు చేశారు.
యుఎఇ సాయుధ బలగాల డిప్యూటి సుప్రీం కమాండర్ కూడా అయిన అల్ నహ్యాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చున్నారు. భారత సైన్యానికి చెందిన క్షిపణులను ప్రయోగించే టి-90 భీష్మ ట్యాంక్, పదాతిదళ యుద్ధ వాహనం బిఎంపి-2కె, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు చెందిన మొబైల్ అటానమస్ లాంచర్, ఆయుధాలను కనుగొనే రాడార్ ‘స్వాతి’, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, ధనుష్ ఆర్టిలరీ గన్‌లు కవాతులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కవాతులో పాల్గొన్న త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అబుదాబి యువరాజుతో పాటు భారత ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, దేశంలోని ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, సైనికాధికారులు, దౌత్యవేత్తలు కవాతును వీక్షించారు. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు దేశంలోని భిన్న చారిత్రక, కళాత్మక, వారసత్వ సంపదలను ప్రదర్శిస్తూ వీక్షకులను అలరించాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శకటానికి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఇతివృత్తం కావడం విశేషం. జాతీయ శౌర్య పురస్కారాలు సాధించిన 25 మంది పిల్లల్లో 21 మంది ఈ కవాతులో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దేశ రాజధాని అంతటా భూమి నుంచి గగనతలం వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరేడ్ సాగుతున్న మార్గానికి ఇరువైపులా గల ఎత్తయిన భవనాలు, ఇతర కట్టడాలపై ఎన్‌ఎస్‌జికి చెందిన సిబ్బంది పొంచి ఉండి కాపలా కాశారు.
తేజస్ విన్యాసాలు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్ మొట్టమొదటిసారి పరేడ్‌లో పాల్గొంది. రెండు దశాబ్దాల విరామానంతరం పరేడ్‌లో పాల్గొన్న స్వదేశీ విమానం ఇదే. కెప్టెన్ మాధవ్ రంగాచారి నేతృత్వంలో మూడు తేజస్ విమానాలు పరేడ్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించాయి. 300 మీటర్ల ఎత్తులో మూడు తేజస్ విమానాలు గంటకు 780కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో విన్యాసాలు చేశాయి. తేలికపాటి, సూపర్ సోనిక్, బహుళ ప్రయోజనాలు కల్పించగల తేజస్ విమానం ఒక ఫైటర్‌తో ప్రయాణిస్తుంది. భారత వాయుసేనకు చెందిన 45 స్క్వాడ్రన్ ఫ్లైయింగ్ డాగర్స్ దళంలో నిరుడు జూలైలో తేజస్ చేరింది. పరేడ్‌లో పాల్గొన్న మరో యుద్ధ విమానం నేత్ర 400కిలోమీటర్ల దూరంలోని శత్రువు విమానాన్ని గుర్తించి విధ్వంసం చేయగల నియంత్రణ వ్యవస్థ కలిగి ఉంది. ఇది కేడా పరేడ్‌లో పాల్గొంది. వీటితోపాటు మూడు మిగ్-35, సూపర్ హెర్క్యులస్ సి-130జె, మిలటరీ ట్రాన్స్‌పోర్టర్ సి-17, అయిదు జాగ్వార్ ఫైటర్ జెట్లతోపాటు సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా విన్యాసాలు చేశాయి.