జాతీయ వార్తలు

భన్సాలీ షూటింగ్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 28: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తన ‘పద్మావతి’ షూటింగ్‌ను నిలిపివేశారు. రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఒక బృందం తనపైనా, షూటింగ్ సెట్లపైనా దాడి చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. సినిమా సెట్టింగ్ వేసిన జైగఢ్ కోట నుంచి సినిమా బృందం ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి నరేంద్ర కుమార్ తెలిపారు. ‘‘అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతి పాత్రలపై ఎలాంటి షూటింగ్ జరగటం లేదని నిర్మాతలు ఇప్పటికే వివరణ ఇచ్చారు. గతంలో కూడా రాజస్థాన్‌లో భన్సాలీ పలు సినిమాలు షూట్ చేశారు. కానీ మునుపెన్నడూ ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగలేదు’’ అని ఆయన వెల్లడించారు. కాగా శుక్రవారం ఆందోళన చేసిన కర్ణిసేన తన వైఖరిని శనివారం కూడా స్పష్టం చేసింది. ‘మేము హింసను అంగీకరించం. షూటింగ్‌ను వ్యతిరేకిస్తూ భన్సాలీని కలిసేందుకు మేం వెళ్తే ఆయన కలవలేదు. పైగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది గాలిలోకి మూడు బుల్లెట్లు కాల్చటం వల్లే సమస్య ఎదురైంది’’ అని కర్ని సేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వి పేర్కొన్నారు. మరోవైపు ‘పద్మావతి’ సెట్లో విధ్వంసకాండపై ఆ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న దీపికా పదుకొనె విస్మయం వ్యక్తం చేశారు. ‘‘పద్మావతి పాత్రను పోషిస్తున్న నేను మీకు హామీ ఇస్తున్నా. ఈ సినిమాలో పద్మావతి పాత్రను ఏ విధంగానూ వక్రీకరించటం లేదు. ధైర్యం, శక్తిమంతురాలైన ఆమె చరిత్రను ప్రపంచానికి చెప్పటమే ఈ సినిమా లక్ష్యం’’ అని ఆమె ట్వీట్ చేశారు. సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్న రణ్‌వీర్ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జరిగిన ఘటన దురదృష్టం. రాజస్థాన్ ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశంలో గొప్ప దర్శకుల్లో సంజయ్ సర్ ఒకరు. ఆయన ఎవరి మనోభావాలను దెబ్బ తీయరు’’ అని పేర్కొన్నారు. ఈ దాడిని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు.