జాతీయ వార్తలు

గోవా ఓటరు మొగ్గేదెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, జనవరి 29: కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశంతో వచ్చే నెల 4న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో పోరు చతుర్ముఖ పోటీగా మారిపోయింది. అధికార బిజెపి మరోసారి అధికారంకోసం దృష్టిపెట్టి పోరాడుతుండగా, కాంగ్రెస్‌తోపాటుగా కొత్తగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీనుంచి ఆ పార్టీకి గట్టి సవాలు ఎదురవుతోంది. రాష్ట్రంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను చూపించి అభివృద్ధి నినాదంపై బిజెపి ఓట్లు అడుగుతుండగా, ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని హామీలను ఎత్తి చూపుతూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం నలభై స్థానాలకుగాను బిజెపి 36 సీట్లకు పోటీ చేస్తూ, నలుగురు స్వతంత్రులకు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ ప్రచారమంతా ‘మరోసారి బిజెపికి అవకాశమివ్వండి’ అనే నినాదంపైనే సాగుతోంది. ప్రాంతీయ పార్టీ అయిన మహారాష్టవ్రాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పొత్తుతో 2012 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి గత అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలను చూపించి ఓట్లు అడుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ఆ పార్టీ రాష్ట్రంలో భారీ ‘సంకల్ప్ ర్యాలీ’లు నిర్వహించడంతోపాటుగా స్థానికంగా పలు సభలు జరిపింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీలాంటి జాతీయ నాయకులు ఈ సభల్లో పాల్గొన్నారు.
ఈసారి కూడా ఉద్ధృతంగా సాగుతున్న బిజెపి ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా రాజ్‌నాథ్ సింగ్ రక్షణ మంత్రి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన మనోహర్ పారికర్ లాంటి నేతలు పాల్గొన్నారు. 2012లో బిజెపి విజయానికి ప్రధాన కారకుడైన మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకే కేంద్రంలో రక్షణ మంత్రిగా నియమించడం తెలిసిందే. ఈసారి కూడా బిజెపి విజయం సాధిస్తే పారికరే తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి కూడా. పోలింగ్‌కు మరో అయిదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లాంటి నేతలు వచ్చే వారం ప్రచారంలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకు పోటీ చేస్తోంది. బిజెపి ప్రచారం జోరుతో పోలిస్తే ఇప్పటివరకు ఆ పార్టీ ప్రచారం చప్పగానే సాగిందని చెప్పాలి. అయితే సోమవారం మపుసాలో జరిగే సభలో పాల్గొననున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకొంది. అయితే తాము ఉద్ధృత ప్రచారం కన్నా ఇంటింటి ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. ఈసారి ఆ పార్టీ అభ్యర్థుల్లో సీనియర్లతోపాటుగా పలు కొత్త ముఖాలు కూడా ఉండడం విశేషం. అంతేకాదు ఒకటి రెండుచోట్ల తప్పిస్తే ఎక్కడా తిరుగుబాట్లు లేకపోవడం కూడా ఆ పార్టీకి కలిసొస్తున్న అంశం. ఏమయినా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ అంశాలకన్నా కూడా స్థానిక సమస్యలే ప్రధానపాత్ర పోషించనుండడంతో ఓటరు ఎటువైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది.

చిత్రం..పనాజీలో ఆదివారం బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్. చిత్రంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు