జాతీయ వార్తలు

రాజీవ్‌గాంధీ హత్యను ముందే పసిగట్టిన సిఐఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యను అమెరికా ముందే ఊహించిందా? ఆయనపై హత్యాయత్నం జరగవచ్చని, ఒకవేళ రాజీవ్ గాంధీ హత్యకు గురయితే లేదా అర్ధంతరంగా నిష్క్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అమెరికా అంచనా వేసిందా? అంటే అవునని తాజాగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలను బట్టి అర్థమవుతుంది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే దానికి అయిదేళ్ల ముందే 1986 జనవరిలోనే అమెరికా గూఢచార సంస్థ సిఐఏ రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యే అవకాశం ఉందంటూ, ‘ఇండియా ఆఫ్టర్ రాజీవ్’ పేరుతో 23 పేజీల నివేదికను రూపొందించింది. అత్యంత సున్నితమైన ఈ రహస్య డాక్యుమెంట్‌ను సిఐఏ ఇటీవలే బహిర్గతం చేసింది.
1986 వరకు అందిన సమాచారం మేరకు సిఐఏ రాసిన ఈ నివేదికలోని మొట్టమొదటి వాక్యంలోనే ‘ప్రధాని రాజీవ్ గాంధీ 1989లో తన పదవీ కాలాన్ని ముగించడానికి ముందే హత్యకు గురయ్యే అవకాశం ఉంది’ అని ఉంది. ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న ముప్పు హత్యా యత్నమేనని మరో వాక్యంలో ఉంది. ఈ నివేదిక రూపొందించిన దాదాపు అయిదేళ్ల తర్వాత 1991 మే 21న రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వద్ద హత్యకు గురయిన విషయం తెలిసిందే.
ఒకవేళ రాజీవ్ గాంధీ హత్యకు గురయి భారత్‌లో హఠాత్తుగా రాజకీయ మార్పు జరిగితే దేశీయంగా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది, అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్‌తో భారత్ సంబంధాలపై దాని ప్రభావం ఎలా ఉండబోదుందనే విషయాన్ని ‘కీ జడ్జిమెంట్స్’ పేరుతో రాసిన తొలిభాగంలో సిఐఏ వివరించింది. అంతేకాదు ఆ సమయంలో పలు తీవ్రవాద గ్రూపులనుంచి రాజీవ్ గాంధీ ప్రాణాలకున్న ముప్పుల గురించికూడా లోతుగా విశే్లషించింది. రాజీవ్ గాంధీ గనుక సిక్కు లేదా కాశ్మీరీ ముస్లిం హంతకుడి చేతిలో బలయితే భారత రాష్టప్రతి కఠినమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ పెద్దఎత్తున అల్లర్లు చెలరేగవచ్చని కూడా ఆ నివేదిక అంచనా వేసింది. అంతేకాదు రాజీవ్ లేకపోతే పీవీ నరసింహారావు, విపి సింగ్ లాంటి ప్రజ్ఞావంతులు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టవచ్చని కూడా సిఐఏ ఆ నివేదికలో పేర్కొంది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయిన తర్వాత పీవీ నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ఈ నివేదికలో చాలా భాగాన్ని తొలగించిన కారణంగా రాజీవ్ గాంధీని హత్య చేసిన శ్రీలంక తమిళ తీవ్రవాదులు (ఎల్‌టిటిఇ) గురించి కూడా సిఐఏ ఈ నివేదికలో విశే్లషించిందో లేదో మాత్రం తెలియరాలేదు.