జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలతోనే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతోపాటు రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చును ప్రభుత్వం భరించే అంశంపై విస్తృత చర్చ జరిగి ఒక నిర్ణయానికి రావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించారు. దేశంలో తరచూ ఎన్నికలు జరగటం వలన దేశాభివృద్ధి కుంటుపడుతోంది, అభివృద్ధి పథకాలు అమలుకావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టప్రతి భవన్ నుండి పార్లమెంటు భవనం వరకు గుర్రపుబగ్గీలో వచ్చిన ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగించటం ద్వారా బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల గురించి ఆయన తమ ప్రసంగంలో విపులంగా వివరించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అన్ని పథకాల గురించి ప్రణబ్ ముఖర్జీ పేరుపేరునా ప్రస్తావించారు. పాత పెద్ద నోట్ల రద్దుద్వారా నల్లధనం, అవినీతి, ఉగ్రవాదానికి తెరదించేందుకు తన ప్రభుత్వం ప్రయత్నించిందని ప్రకటించారు. లోక్‌సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కొంతకాలం క్రితం నరేంద్ర మోదీ ప్రతిపాదించటం తెలిసిందే. రాష్టప్రతి ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ధన బలాన్ని అదుపు చేసేందుకు ఎన్నికల ఖర్చును ప్రభుత్వం భరించే అంశంపై చర్చ జరగాలని ప్రతిపాదించారు. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహిండంతోపాటు రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుకోసం నిధిని ఏర్పాటు చేయటం గురించి కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించారు. దేశంలో తరచూ సుదీర్ఘంగా ఎన్నికలు జరగటం వలన దేశాభివృద్ధి దెబ్బతింటోంది, దీనితోపాటు పలు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి, పథకాలు అమలు కావటం లేదు, అధికారుల సమయం ఎన్నికల నిర్వహణకే సరిపోతోందని రాష్టప్రతి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఒక గంటా పది నిమిషాలపాటు కొనసాగిన ప్రసంగంలోని మొదటి, ఆఖరు భాగాలను ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ హిందీలో చదివి వినిపించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ (అందరి వెంట, అందరి ప్రగతి) కోసం తన ప్రభుత్వం పని చేస్తోందని రాష్టప్రతి ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌ను కలుపుకున్న సాధారణ బడ్జెట్ వస్తోంది, అదేవిధంగా బడ్జెట్ నెల రోజుల ముందుకు జరిగింది కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు ఎంతో చారిత్రాత్మకమైనవని ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. నల్లధనంపై పోరాడేందుకు జరిగిన పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశ ప్రజలు కనబరచిన ఓర్పును ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆర్థికాభివృద్ధితోనే బీదరికం నిర్మూలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జన్‌ధన్- ఆధార్-మొబైల్ వ్యవస్థ ద్వారా రాయితీలను నేరుగా లబ్దిదారులకు బదిలీ చేయటం వలన 36వేల కోట్ల రూపాయల పొదుపు జరిగిందని ఆయన వెల్లడించారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలవారి వద్దకు బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకుపోయేందుకే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకును ఏర్పాటు చేశారని చెప్పారు. జనశక్తి స్వచ్ఛ్భారత్ మిషన్‌ను ప్రజా ఉద్యమంగా మార్చివేసిందని ప్రణబ్ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ మూలంగా దేశంలోని 1.4 లక్షల గ్రామాలు, 450 నగరాలు, 77 జిల్లాలు, మూడు రాష్ట్రాలు బహిరంగ మల, మూత్ర విసర్జన రహితమయ్యాయని ప్రకటించారు. ఆంత్యోదయ, జన్‌ధన్, గ్రామ్ డాక్ సేవక్, ప్రధాన మంత్రి ముద్రా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, గ్రామజ్యోతి యోజనతోపాటు ఎన్‌డిఏ చేపట్టిన అన్ని పథకాల ప్రధాన లక్ష్యం దేశంలోని కోట్లాది మంది బడుగు, బలహీన, తాడిత, పీడిత ప్రజల అభ్యున్నతేనని ఆయన స్పష్టం చేశారు. 2015-20 మధ్య గ్రామ పంచాయతీలకు రెండు లక్షల కోట్లు ఇస్తున్నారని రాష్టప్రతి చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తన ప్రభుత్వం పెద్దఎత్తున రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తోందన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం హైవేలు, ఐ-వేలు, రైల్వే వ్యవస్థ అభివృద్ధి, వాటర్ వేస్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోని నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు తన ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు వంటి అత్యంత సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నదని రాష్టప్రతి తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు తమ ప్రభుత్వం నల్లధనం చట్టం, బినామీ ఆస్తుల చట్టం, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకాన్ని అమలు చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే నల్లధనాన్ని అదుపు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఆయన పాత పెద్ద నోట్ల రద్దు మూలంగా ఏ మేరకు నల్లధనం అదుపులోకి వచ్చింది, ఏ మేరకు పాతనోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయనే వివరాలు మాత్రం వెల్ల్లడించలేదు. మహాత్మా గాంధీ చూపిన బాటలో ముందుకుసాగుతూ సంవాదం, సమన్వయం, సమవేదం ఆధారంగా జాతి నిర్మాణానికి కృషి చేస్తామని ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. అందరి వెంట, అందరి ప్రగతికోసం అందరం కృషి చేయాలంటూ ప్రణబ్ ముఖర్జీ తమ ప్రసంగాన్ని ముగించారు.

చిత్రం..పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వందనం