జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారంలో మోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 27న హరీశ్ రావత్ సర్కారును రద్దు చేసి రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం రద్దు చేసింది. హరీశ్‌రావత్ ప్రభుత్వాన్ని తక్షణం పునరుద్ధరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సుమారు రెండున్నర గంటల పాటు ఓపెన్ కోర్టులో న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 29న శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవలసిందిగా రావత్‌ను కోర్టు ఆదేశించింది.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పెకిలించే ప్రయత్నం చేసిందంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తన సుదీర్ఘ తీర్పులో హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్టప్రతి పాలన విధింపు నిర్ణయంలోని ఔచిత్యాన్ని సవాలు చేస్తూ హరీశ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం జోసఫ్, జస్టిస్ వీకే బిస్త్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపు సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేసింది. అయితే తాము ఇచ్చిన ఈ తీర్పు కేవలం ఉత్తరాఖండ్ వ్యవహారానికి మాత్రమే పరిమితమని..మొత్తం 356 అధికరణం వినియోగానికి ఇది వర్తించదని ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. అంతే కాదు.. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు సరైనదేనని కొనసాగించటం ఈ వ్యవహారంలో కీలక పరిణామం. ఫిరాయింపు ద్వారా రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా వ్యాఖ్యానించింది. తమ తీర్పు వెలువరించే దాకా, కనీసం వారం పాటు రాష్టప్రతి పాలనను రద్దు చేయరాదని హైకోర్టు ఇంతకుముందే ప్రభుత్వ న్యాయవాదిని హామీ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. కానీ, తాను హామీ ఇచ్చే పరిస్థితిలో లేనని న్యాయవాది పేర్కొనటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరిలా హామీ ఇవ్వకపోతే.. ఇదే పని రేపు అన్ని రాష్ట్రాల్లో చేస్తారు. కేంద్రం వ్యవహరించిన తీరుపై మాకు ఆగ్రహం కంటే బాధ ఎక్కువగా కలిగించింద’ని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తాము సుప్రీం కోర్టులో అప్పీలు చేసేందుకు వీలుగా తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వ న్యాయవాది వౌఖిక విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తిరస్కరించింది. ‘ ఇప్పుడు అక్కడ రాష్టప్రతి పాలన లేదు. ప్రభుత్వం పునరుద్ధరణ జరిగింది. తీర్పు రాసేందుకు సమయం ఇవ్వాలని మేం కోరాం.. కానీ తప్పనిసరిగా ఈరోజు తీర్పు ఇచ్చే పరిస్థితి కల్పించారు. మీరు సుప్రీం కోర్టుకు వెళ్లటానికి మాకేం అభ్యంతరం లేదు. అక్కడ అప్పీలు చేసుకుని తీర్పుపై స్టే తెచ్చుకొండి’ అంటూ కరాఖండిగా న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదికి తేల్చి చెప్పింది. వాస్తవానికి మార్చి 18న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్యబిల్లు ఓడిపోయిందని, రావత్ సర్కారు మెజార్టీ కోల్పోయిందని, 9మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసిన దరిమిలా మార్చి 28న హరీశ్‌రావత్ సర్కారును విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. విశ్వాసపరీక్షకు సరిగ్గా ఒక రోజు ముందు కేంద్రప్రభుత్వం రాష్టప్రతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకోవటంతో వివాదం మొదలైంది.
దాదాపు రెండున్నర గంటల పాటు బహింరంగ కోర్టులో డిక్టేట్ చేసిన సుదీర్ఘ తీర్పులో హైకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్ రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఫిరాయింపులు, 356వ అధికరణం తదితర అంశాలపై సున్నితమైన వ్యాఖ్యానాలు చేసింది.
- ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వాలను వదిలించుకోవటానికి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయటానికి కేంద్రానికి స్వేచ్ఛ ఉందా? రాష్ట్రాల్లో అరాచకం సృష్టించటం, ఎండా, వానా, చలిని ఎదుర్కొని ఓటేసిన సామాన్య ఓటరు విశ్వాసాన్ని వమ్ము చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందా?
- సస్పెన్షన్ అయినా, రద్దయినా.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయటం, ప్రజాస్వామ్య వ్యవస్థను, సమాఖ్య వ్యవస్థ పునాదులను తక్కువ చేయటమే.
- ఈ వ్యవహారాన్ని ఒక రాష్ట్రానికి చెందిన అంశంగా చూడరాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగా భారత్ కూడా కేంద్ర, రాష్ట్రాలు వాటి వాటి పరిధుల్లో స్వయంప్రతిపత్తిగలవిగా చూడాలి
- ఒకటి మాత్రం స్పష్టం. 356వ అధికరణాన్ని చాలా అప్రమత్తతతో, చివరి ప్రత్యామ్నాయంగా వినియోగించాలి.
- ఇక్కడ పిటిషనర్ ప్రభుత్వం పడిపోవటం అన్నది సమస్య కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది కీలకాంశం
- కేవలం ద్రవ్యబిల్లుపై డివిజన్ ఓటును తొక్కిపెట్టి పాస్ చేయించారన్న ప్రాతిపదికపై ఏకంగా ప్రభుత్వానే్న కూలదోస్తారా?
..........................
రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్ వ్యవహారం పార్లమెంట్ బడ్జెట్ రెండోదఫా సమావేశాలలో మోదీ సర్కారుపై విరుచుకుపడటానికి కాంగ్రెస్‌కు ప్రధానాస్త్రంగా మారింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచిన మోదీ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి గురువారం నోటీసు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ నిబంధనావళిలోని రూల్ 267 పరిధిలో అన్ని అంశాలను పక్కన పెట్టి ఈ తీర్మానాన్ని చేపట్టాలని అన్సారీని కాంగ్రెస్ కోరింది.

చిత్రం హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు అభినందనలు తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు