జాతీయ వార్తలు

తిరగబడ్డ కన్నీర్ సెల్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 7: తమిళనాడు రాజకీయాలు నాటకీయ మలుపు తిరిగాయి. ఏక్షణంలోనైనా శశికళ సిఎం పగ్గాలు చేపడతారన్న తరుణంలో ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరగబడ్డారు. ఉన్నఫళంగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జయ సమాధి వద్దకెళ్లి ముప్పావుగంట పాటు ధ్యానం చేశారు. అనంతరం ‘అమ్మ ఆత్మ వాస్తవాలు చెప్పమంది’ అంటూ మీడియా ముందు తన ఆగ్రహాన్ని, అక్కసును, వేదనను వెళ్లగక్కారు. కన్నీంటిపర్యంతమైన ఆయన శశికళ, ఆమె అనుయాయులు తనను ఏవిధంగా వేధించారో కళ్లకుకట్టినట్టు వివరించారు. ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా తన చేత రాజీనామా చేయించారంటూ వాపోయారు. శశికళ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి వీలుగానే తనపై కొందరు మంత్రులు వత్తిడి తెచ్చారని, శాసన సభ పక్ష నేతగా ఆమెను ఎన్నుకున్నారంటూ జరిగిన పరిణామాలను మీడియా ముందు ఏకరువు పెట్టారు. అమ్మ తననే ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావించిందని వెల్లడించిన ఆయన, జయ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఒక్కొక్కటిగా వివరించారు. దాదాపు 40 నిమిషాలపాటు జయ సమాధి ముందే కూర్చుండిపోయిన పన్నీర్ సెల్వం, ఏమాత్రం దాచుకోకుండా శశికళ, ఆమె విధేయుల చేతిలో తాను ఏవిధంగా అవమానాలకు గురైందీ బహిర్గతం చేశారు. గత కొన్ని రోజులుగా తాను మానసికంగా ఎంతగానో కుంగిపోతున్నానని, అందుకే తమిళనాడు ప్రజలకు, అదేవిధంగా దేశ ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలనే నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎలాంటి లోపాలకు తావులేకుండా తన బాధ్యతలను నిర్వర్తించానన్నారు. అమ్మ నిర్దేశించిన బాటలోనే ముందుకెళ్లాలని వెల్లడించారు. ఆమె ఆశయాలను ఆచరణాత్మకం చేయడానికి అంకితభావంతో పని చేశానని చెప్పుకున్నారు. జయ ఆస్పత్రిలో ఉన్నపుడే తనను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరారన్నారు. తానెప్పుడూ పదవులను ఆశించలేదని, ‘వారే’ తనను ముఖ్యమంత్రిని చేశారని వెల్లడించిన పన్నీర్ సెల్వం ‘అలాంటప్పుడు ననె్నందుకు అవమానించాలి’ అంటూ ఆగ్రహించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడే శశికళ సిఎం పదవి చేపట్టాలంటూ రెవిన్యూ మంత్రి ఆర్‌బి ఉదయ్‌కుమార్ డిమాండ్ చేశారని తెలిపారు. ఇదే విషయాన్ని తాను శశికళకు కూడా వివరించానని స్పష్టం చేశారు. వాస్తవాలను వెల్లడించాలని నిర్ణయించిన తరువాతే అమ్మ సమాధి ముందు 40 నిమిషాలు ధ్యానం చేశానన్నారు. శశికళ ఇంట్లో జరిగిన సమావేశంలోనే కొందరు సీనియర్ నాయకులు ఆమెనే ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రస్తావన చేశారన్నారు. ఆ డిమాండ్‌ను తాను నిరసించానని, వారి ధోరణికి విస్తుపోయానని కూడా పన్నీర్ చెప్పుకొచ్చారు. ఏవిధంగా శశికళను ముఖ్యమంత్రిని చేస్తారని కూడా ప్రశ్నించినట్టు తెలిపారు. అయినా తన వాదన ఫలించలేదని, బలవంతంగానే తనచేత రాజీనామా చేయించారని స్పష్టం చేశారు. చివరి క్షణం వరకూ కూడా తాను వారి డిమాండ్‌ను ఒప్పుకోలేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న వ్యక్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నది అన్నాడిఎంకె సిద్ధాంతపరంగా వస్తోందని, ఆ కారణంగానే శశికళే సిఎం కావాలని మంత్రులు పట్టుబట్టినట్టు తెలిపారు. జయ సమాధి సాక్షిగానే తాను వాస్తవాలను వెల్లడిస్తున్నానని, తనకు జరిగిన అవమానాలపై ఒంటరిగానే పోరాడతానన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు కోరితే ముఖ్యమంత్రి పదివికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. అన్నాడిఎంకెను, ప్రభుత్వాన్ని పరిరక్షించగలిగే వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని, అలాంటి వ్యక్తి తానే కావాల్సిన అవసరం కూడా లేదని పన్నీర్ సెల్వం అన్నారు. వార్ధా తుపాను సమయంలో ప్రజలను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశానని, అందుకు తన ప్రభుత్వానికి ప్రశంసలు కూడా వచ్చాయన్నారు. ఇంతగా తన ప్రభుత్వం పని చేయడం శశికళ వర్గానికి కంటగింపుగా మారిందన్నారు. తనను అవమానించారని, వేధించారని మంత్రులే పనిగట్టుకుని శశికళకు వంతపాడారని తెలిపారు. శశికళను సిఎం చేయాలన్న డిమాండ్ ముఖ్యంగా మంత్రులే అందుకు పట్టబట్టడం తనను నివ్వెరపర్చిందని స్పష్టం చేశారు. తాజా పరిణామంతో అన్నాడిఎంకె రెండుగా చీలిపోయే పరిస్థితి తలెత్తింది. మొదటినుంచీ కూడా శశికళను వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు పన్నీర్ సెల్వంకు అండగా నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలావుంటే, అన్నాడిఎంకె శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన రాజ్యాంగ బాధ్యత గవర్నర్ విద్యాసాగర్ రావుపై ఉందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ ప్రమాణ స్వీకారాన్ని ఆపలేరని, అలా చేయడానికి బలమైన కారణమూ లేదని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ముంబయిలోవున్న రాష్ట్ర గవర్నర్ చెన్నై రాకను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇలావుంటే జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులు అన్నాడిఎంకె వైరివర్గాల మధ్య తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామాల తీవ్రతను బట్టి చూస్తే తమిళనాట రాజకీయ అనిశ్చితి అనివార్యంగానే కనిపిస్తోంది. శశికళ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఇప్పట్లో కనిపించకపోవడం, అధికార పార్టీలోనే కుమ్ములాటలు మొదలుకావడంతో తమిళనాడు ఏదిశంగా పయనిస్తోందన్నది రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

చిత్రం..జయలలిత సమాధి ఎదుట ధ్యానంలో కూర్చున్న మాజీ సిఎం పన్నీర్ సెల్వం