జాతీయ వార్తలు

దోపిడీలిక సాగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశంలో ఇంతకాలం సాగిన దోపిడీ విధానం ఇక సాగదని ప్రధాని నరేంద్ర మోదీ ఖరాఖండిగా ప్రకటించారు. పేదలను దోచుకుంటున్న వారిపట్ల కఠిన వైఖరి అవలంభిస్తామని తెగేసి చెప్పారు. ‘ఇకమీదట పేదలను దోచుకునే విధానం కొనసాగనివ్వం. పేదల హక్కులు, వారి వాటా ఇవ్వాల్సిందే. అందుకు కృతనిశ్చయంతో ఉన్నాం’ అని పార్లమెంట్‌లో మోదీ ఆవేశంగా ప్రకటించారు. దేశంలో కాంగ్రెస్ కుటుంబ పాలన ప్రోత్సహిస్తుంటే, నిరుపేదను ప్రధానిని చేసి దేశ ప్రజలు తమ సత్తా చాటుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం మోదీ ఇచ్చిన సమాధానంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గేపై వంగ్య బాణాలు విసిరారు. పెద్ద నోట్ల రద్దును సమర్ధించుకున్న మోదీ, గత నవంబర్ 8న కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్న తరుణం చూసే నిర్ణయం తీసుకున్నామని, బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు. లోక్‌సభతోపాటు ఆయా రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించటంపై రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలన్నారు. ఈ విధానంతో మంచిపాలన అందించే వీలుతోపాటు అభివృద్ధి సమర్థంగా అమలు చేయగలుగుతామని మోదీ సూచించారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వలన కొన్ని ఇబ్బందులు తలెత్తినా, దేశం కోసం సహించటంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌ను ముందుకు జరిపేందుకు దారి తీసిన పరిస్థితులను మోదీ వివరించారు. బ్రిటీష్ పార్లమెంట్‌కు అనుగుణంగా బడ్జెట్‌ను సాయంత్రం 5.30కు ప్రతిపాదించే వారని గుర్తు చేస్తూ, వాజపేయి సర్కారు ఆ సమయాన్ని మధ్యాహ్నం 12కు మార్చిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఫిబ్రవరి మొదటి తేదీకే బడ్జెట్‌ను మార్చినట్టు వివరించారు. దీనివల్ల నిధులు సక్రమ వినియోగానికి అవకాశం ఉంటుందన్నారు. రవాణా వ్యవస్థలో పెనుమార్పులు వచ్చినందున సమగ్ర రవాణా విధానం కోసమే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపామన్నారు.
అనేక అంశాలు లోతుగా పరిశీలించాకే పెద్ద నోట్లు రద్దు చేశామని మోదీ వివరించారు. చానెళ్లలో బైటీ కోసం దీనిపై నానా యాగీ చేసిన విపక్షాలు, పార్లమెంట్‌లో చర్చకు సిద్ధపడకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. నల్లధనం బంగారం, వజ్రాలు, స్థిరాస్తుల రూపంలో ఉంటుందంటూ కాంగ్రెస్ పక్షనేత ఖర్గే చేసిన సూచనతో ఏకీభవిస్తున్నామన్నారు. ఆయితే 1988లో బినామీ ఆస్తుల చట్టం చేసిన మీరు, నోటిఫై చేయకుండా ఎందుకు నిలిపారని ప్రశ్నించారు. తాము బినామీ చట్టాన్ని నోటిఫై చేశామని, బినామీ ఆస్తులున్నవారంతా చార్టెడ్ అకౌంట్లను కలుసుకోవడం మంచిదని మోదీ హితవు పలికారు. త్వరలోనే బినామీ ఆస్తుల జప్తు మొదలవుతుందని పరోక్షంగా హెచ్చరించారు.
దేశ స్వాతంత్రం కోసం కేవలం కాంగ్రెస్సే పోరాడిందంటూ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు. కాంగ్రెస్ కంటే ముందు ఎంతోమంది దేశం కోసం పోరాడారంటూ పలు వివరాలు సభ ముందు పెట్టారు. స్వచ్చ భారత్ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ, తనకు ఎలాంటి హాని కలిగినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరిశుభ్రం చేసేందుకు తాను తీసుకుంటున్న చర్యలు కొందరు పెద్దలకు నష్టం, బాధ కలిగిస్తున్నాయి. వారెంతకైనా తెగించవచ్చని మోదీ వ్యాఖ్యానించారు.
గత రాత్రి భూకంపం రానే వచ్చిందింటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌పై మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. తాను నోరు విప్పితే దేశంలో భూకంపమేనంటూ గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయన ఎప్పుడో మాట్లాడితే ఇప్పుడు భూకంపం వచ్చిందని చలోక్తి విసిరారు. ఎన్డీయే ఏ పథకం చేపట్టినా తాము ఇదివరకే చేశామని చెప్పుకోవటం కాంగ్రెస్‌కు రివాజుగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనకు తమ పాలనకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 51 గ్రామాల్లో ఫైబర్ ఆప్టికల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తే, తమ హయాంలో ఇది వేలాది గ్రామాలకు విస్తరించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజూ ఏడు కిలోమీటర్లమేర రోడ్లు నిర్మిస్తే, తమ హయాంలో 11 కిలోమీటర్లకు పెంచామన్నారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నపుడు దేశానికి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వచ్చాయని చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను ఎందుకు వ్యతిరేకిస్తోందని మోదీ ప్రశ్నించారు. స్వచ్చ భారత్ పథకాన్ని సైతం కాంగ్రెస్ వ్యతిరేకించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్ దాడులను సమర్థించుకుంటూ సైనిక చర్యను ప్రశ్నించటం సిగ్గు చేటని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.