జాతీయ వార్తలు

ఎన్నికల సంస్కరణలపై తగ్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: లా కమిషన్ సిఫార్సు చేసిన ఎన్నికల సంస్కరణలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. రెండేళ్లు, అంతకు పైబడి శిక్షపడిన అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతను ఆరేళ్లకు పరిమితం చేస్తున్న నిబంధనను తొలగించాలని కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలయిన సందర్భంగా కేంద్రం ఈ విషయం తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రాలతో కూడిన బెంచ్ ముందు కేంద్రం ఈ విషయం తెలియజేసింది. లా కమిషన్ సమర్పించిన రెండు నివేదికల్లో పలు ఎన్నికల సంస్కరణలను, రాజకీయ పార్టీలు, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం నియంత్రణకు పలు సూచనలు చేసిందని కేంద్రం తెలిపింది. ఈ సిఫార్సును పరిశీలించి, అమలుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి న్యాయ శాఖ సీనియర్ అధికారులతో ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్‌లో తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చర్య తీసుకోవడం ఖాయం గనుక ఈ రిట్ పిటిషన్‌ను పరిశీలన దశలోనే తిరస్కరించాలని వినయపూర్వకంగా కోరుతున్నట్లు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొంది. ఒక లెజిస్లేటర్ అనర్హతను ఆరేళ్లకు పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్లు అనర్హత కాలాన్ని ఆరేళ్లకు మాత్రమే పరిమితం చేస్తున్నాయని, అంతేకాక దోషిగా నిర్ధారించిన వ్యక్తిని పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తున్నందున చట్టంలోని ఈ రెండు సెక్షన్లు చెల్లవని ప్రకటించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. అయితే చట్టంలోని ఈ సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమైనవని, చెల్లవని చెప్పడానికి అవసరమైన సమాచారాన్ని పిటిషనర్ సమర్పించలేదని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మోనికా అరోరా కోరారు. కాగా, కేసు తదుపరి విచారణను కోర్టు మే 17కు వాయిదా వేసింది.

చిత్రం..ఎన్నికల సంస్కరణలకు నిరసనగా మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు