జాతీయ వార్తలు

ఇక గవర్నరే తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 9: తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం గురువారం పరాకాష్టకు చేరింది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమదేనని ఇటు శశికళ, అటు పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలుసుకుని తమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాలతో భేటీ అయిన గవర్నర్ నిర్ణయం ఏమిటన్నది స్పష్టం కావడం లేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఇరు వర్గాలదీ ఎదురుచూపుల చందంగానే మారింది. పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారడం, క్షణక్షణం ఉత్కంఠ పెరగడంతో ఏ మార్గంలో ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయనిపుణులతో గవర్నర్ సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తిస్థాయిలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు జాబితా అందించిన శశికళను ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆయన ఆహ్వానిస్తారా లేదా అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గురువారం ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకూ రాష్ట్ర రాజకీయాలు ఊహాగానాలతో వేడెక్కిపోయాయి. ఇటు శశికళ వర్గం, అటు సెల్వం వర్గం ఎత్తుకు పైఎత్తు వేస్తూ తమ పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తూనే వచ్చాయి. గవర్నర్‌తో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమైన శశికళ ప్రభుత్వం ఏర్పాటుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు అవసరమైన ఎమ్మెల్యేలు తనవెంటే ఉన్నట్లు చాలా గట్టిగానే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొదట ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్నారు. సాయంత్రం ఐదుగంటలకు ఈ సమావేశం జరిగింది. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన పన్నీర్ సెల్వం ధర్మమే నెగ్గుతుందని, రాష్ట్రానికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించారు. తనకు మాజీ మంత్రులు కె.పి.మునుస్వామి, నాథం ఆర్.విశ్వనాథన్, రాజ్యసభ ఎంపి వి.మైత్రేయన్ సహా పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అలాగే చివరి క్షణంలో శశికళ శిబిరంనుంచి వచ్చిన అన్నాడిఎంకె ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదనన్ కూడా తనను సమర్థిస్తున్నట్లు తెలిపారు. తనకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటానని కూడా సెల్వం స్పష్టం చేశారు. అయితే ఎంతమంది తనను బలపరుస్తున్నారనేదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ సందర్భంగా శశికళ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను ఎంతగానో విశ్వసించిన జయలలితకే శశికళ ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం శశికళ ఉంటున్న పొయస్ గార్డెన్‌ను జయలలిత సంస్మరణ కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. జయలలిత వ్యక్తిగత వస్తువులన్నింటినీ పరిరక్షించాలని, పొయస్ గార్డెన్‌ను సంస్మరణ కేంద్రంగా మార్చేవరకు పోరాడతానని చెప్పారు. తనను ద్రోహిగా పేర్కొంటున్న శశికళే అసలు ద్రోహి అని, అందుకు 2012లో జయలలితకు ఆమె రాసిన క్షమాభిక్ష లేఖే నిదర్శనమని అన్నారు. ఆ లేఖను మీడియా ముందు చదివి వినిపించారు. శశికళకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
శశికళ తన మద్దతుదారులతో గవర్నర్‌ను కలుసుకోవడానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన ఆమె అక్కడ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఉంచారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్నారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలందరి పేర్లతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందించి తననే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని స్పష్టం చేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనకు ఇచ్చిన మద్దతు లేఖలను ఆయనకు అందించారు.
పరిస్థితి పూర్తిగా శశికళకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆమెకున్న మెజారిటీ మద్దతు స్పష్టమవుతున్నప్పటికీ గవర్నర్ ఏమి చేయబోతున్నారనేది వెల్లడి కాలేదు. తాజా పరిస్థితిపై భిన్న కోణాల్లో విశే్లషించేందుకు వీలుగా న్యాయ నిపుణులను ఆయన సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన శశికళ ఏర్పాటుచేసిన సమావేశానికి 131మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారందరి మద్దతు తనదేనంటూ శశికళ గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో స్పష్టం చేశారు.

చిత్రం..గవర్నర్ విద్యాసాగర్‌రావుకు మద్దతుదారుల జాబితా అందిస్తున్న శిశికళ