జాతీయ వార్తలు

ఎదురుచూపులే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 10:తమిళనాడు అధికార అన్నాడిఎంకెలో ఆధిపత్య పోరు మొదలైంది. పరస్పర బహిష్కరణల పర్వం రాజుకుంటోంది. శశికళ, పన్నీర్‌సెల్వం నుంచి మద్దతుదారుల జాబితాను అందుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో శుక్రవారం పరిస్థితి మరింత వేడెక్కింది. గవర్నర్ నిర్ణయం వెలువడే లోగా తమదే మెజార్టీ అని రుజువు చేసుకోవడంలో ఇరువర్గాలు నిమగ్నమయ్యాయి. ఉన్నట్టుండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంవైపు తిరిగిన అన్నాడిఎంకె ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదనన్‌పై శశికళ వేటువేశారు. ఆయన్ని పదవి నుంచి తొలగించి మాజీ మంత్రి సెన్‌గొట్టయ్యన్‌ను నియమించారు. దాంతో విస్తుపోయిన మధుసూదనన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌నే ఆశ్రయించారు. శశికళను ఎప్పుడో బహిష్కరించామని, ఆమెను అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా గుర్తించొద్దంటూ లేఖ రాశారు. ఆమె ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారం జరిగిందేమీ కాదన్నారు. పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా శశికళ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఎన్నికల కమిషన్‌ను లేఖరాసిన విషయం తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
కాగా, తనకే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తననే అహ్వానించాలన్న శశికళ డిమాండ్‌పై గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఫలితంగా..రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడం లేదు. మరోపక్క శశికళపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వచ్చేవారమే సుప్రీం కోర్టు తీర్పు వెలువడే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం కొనసాగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శశికళపై మరింత తీవ్ర స్థాయిలో పన్నీర్ సెల్వం విరుచుకు పడ్డారు. అన్నాడిఎంకెను ‘ఓ కుటుంబం’ చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనివ్వమని, అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునే వారి కల పగటికలేనని అన్నారు. పార్టీ కోశాధికారిగా తనను తొలగిస్తూ శశికళ తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రం చెల్లదని అన్నారు. తాను అదే పదవిలో కొనసాగుతున్నానని ఉద్ఘాటించారు.మధుసూదనన్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించడం ద్వారా తనను వ్యతిరేకిస్తున్న వారికి శశికళ బలమైన హెచ్చరిక సందేశానే్న పంపారు. మధుసూదనన్‌తో ఇక పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని, కార్యకర్తలందరూ సెన్‌గొట్టయ్యన్‌కు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమను శశికళ ‘బంధించ’లేదని ఆమె విధేయ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ విషయంలో పన్నీర్‌సెల్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదిలా ఉండగా ప్రజాస్వామికంగా, రాజ్యాంగ బద్ధంగా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వానే్న ఏర్పాటు చేయాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు వీలుగా అసెంబ్లీలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగే విధంగా బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. గవర్నర్‌ను కలుసుకున్న ఆయన ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రం అందించారు. ఇదే రకమైన అనిశ్చితి కొనసాగితే పరిస్థితి అదుపుతప్పి శాంతి భద్రతల సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.