జాతీయ వార్తలు

అవమానించడం కాదు.. ప్రశంసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 10: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘రెయిన్‌కోట్’ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడం సరికాదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిజానికి అది మన్మోహన్ సింగ్‌ను పొగడుతూ చేసిన వ్యాఖ్యే తప్ప అవమానించే వ్యాఖ్య కాదని ఆయన అన్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ సైతం ప్రధానిని విమర్శించకుండా వదిలిపెట్టలేదని కూడా ఆయన అన్నారు. ‘ప్రధాని మోదీ తన రెయిన్‌కోట్ వ్యాఖ్యల ద్వారా ఎవరినీ కించపరచలేదు. నిజానికి మాకందరికీ మన్మోహన్ సింగ్ అంటే ఎంతో గౌరవం. యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తి చూపించడానికి చేసిన వ్యాఖ్య మాత్రమే’ అని రాజ్‌నాథ్ శుక్రవారం లక్నోలో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగినా మన్మోహన్ ఇమేజిపై ఒక్క మచ్చ కూడా లేదని చెప్పడం కోసమే మోదీ అలా అన్నారని, నిజానికి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించారని అంటూ, దీనిపై వివాదం చెలరేగడం దురదృష్టకరమన్నారు. మన్మోహన్ సింగ్‌పై రెండు రోజుల క్రితం ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ వాకౌట్ చేశారు. అంతేకాదు, మోదీ పార్లమెంటులో ఉంటే తాము బాయ్‌కాట్ చేస్తూనే ఉంటామని ప్రకటించడం తెలిసిందే.
అయితే నోట్ల రద్దుపై రాజ్యసభలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ నోట్ల రద్దును ‘వ్యవస్థీకృత నేరం’గా అభివర్ణించిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. ‘అంటే ప్రభుత్వం చేసింది వ్యవస్థీకృత నేరమనే అర్థం. ప్రభుత్వానికి అధిపతి ప్రధాని. మన్మోహన్ ప్రకటనను లోతుగా పరిశీలించినట్లయితే నేరస్థుడు నేరానికి పాల్పడ్డాడని అర్థం వస్తుంది. అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోండి’ అని రాజ్‌నాథ్ అన్నారు. అంతేకాదు ఇలాంటి వ్యాఖ్యల లోతుల్లోకి వెళ్లడం సరికాదని కూడా రాజ్‌నాథ్ అన్నారు.
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకురావడం గురించి అడగ్గా, ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పాకిస్తాన్‌కు ఇచ్చిందని, ఆయనను భారత్‌కు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి చెప్పారు. బిజెపి మేనిఫెస్టోలో ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని చేర్చడం గురించి అడగ్గా, ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని అంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు.