జాతీయ వార్తలు

దేవభూమికి మచ్చతెచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్, ఫిబ్రవరి 10: దేవభూమి అయిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కళంకం తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌కు సంబంధించి వాజపేయి స్వప్నాన్ని వాస్తవ రూపంలోకి తీసుకు రావడానికి భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగించాలని ఆయన కోరారు. శుక్రవారం ఇక్కడి రుషికుల్ మైదానంలో బిజెపి నిర్వహించిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ‘ఎవరి జీవితంలోనయినా 16 ఏళ్ల వయసు ఎంతో కీలకమైనది. ఎందుకంటే వచ్చే అయిదు సంవత్సరాల కాలంలో జీవితంలో ఎన్నో అంశాలకు సంబంధించి ఒక రూపం వస్తుంది. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే రాష్ట్రం ఆవిర్భవించి 16 ఏళ్లయింది. రానున్న అయిదేళ్ల కాలంలో రాష్ట్రం ఎటు పయనించాలనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేయవలసి ఉంది’ అని మోదీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో అవినీతి అనేది న్యాయస్థానాల్లో నిరూపితం కావలసిన అవసరం లేదని, ఎందుకంటే దేశం మొత్తం ఈ అవినీతిని టీవీలలో చూసిందని ఆయన పేర్కొన్నారు. ‘ఒకప్పుడు ఈ దేవభూమి పేరు చెబితే ఆధ్యాత్మిక భావనలు ఆవహించేవి. కాని అది ఎంతో కాలం నిలవలేదు. ఇప్పుడు ఈ పదం చెబితే కళంకిత ప్రభుత్వం చిత్రాలు మన మదిలో మెదలుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. దేవుడి జన్మభూమి ప్రతిష్ఠను దిగజార్చిన ఈ కళంకిత ప్రభుత్వానికి ఓటు వేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఉత్తరాఖండ్ గురించి వాజపేయి కన్న కలలను నిజం చేసే లక్ష్యాన్ని తాను చేపట్టానని పేర్కొన్నారు. అందువల్ల ఉత్తరాఖండ్ ప్రతిష్ఠను పునరుద్ధరించే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
నోట్ల రద్దు వల్ల కొంతమంది ఇప్పటికీ నిద్ర పోలేకపోతున్నారని, ఎందుకంటే వారి నల్ల ధన వ్యాపారం లెక్కలన్నీ ఇప్పుడు బ్యాంకుల్లోకి వచ్చాయని మోదీ అన్నారు. ‘ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది, ఎవరు, ఎలా తెచ్చారు.. ఇదంతా ఇప్పుడు కెమెరాల ముందు ఉంది. అందుకే వారు నిద్ర పోలేకపోతున్నారు’ అని ప్రధాని అన్నారు. 70 ఏళ్ల పాటు ఈ దేశం దోపిడీకి గురయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తాను ఈ ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని మోదీ అన్నారు. ఈ నల్లధనమంతా పేదల నుంచి దోచుకున్నదేనని, అందువల్ల తాను దీన్ని తిరిగి పేదలకు ఇవ్వవలసి ఉన్నదని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ ప్రత్యర్థులను అణచివేస్తోందని ప్రధాని ఆరోపించారు. మార్చి 11న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దీన్ని బహిర్గతం చేస్తాయన్నారు. కొత్తగా ఏర్పడే బిజెపి ప్రభుత్వం ఇలాంటి కేసులన్నింటిపై దర్యాప్తు జరిపిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరాప్రదేశ్‌లో గాలి బిజెపికి అనుకూలంగా ఉన్న విషయాన్ని గమనించి, అనేక సంవత్సరాల పాటు శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఈ ఎన్నికల్లో ఒక్కటయ్యాయని మోదీ విమర్శించారు.

చిత్రం..హరిద్వార్‌లో శుక్రవారం బిజెపి నిర్వహించిన
విజయ్ సంకల్ప్ ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ