జాతీయ వార్తలు

పళనిస్వామికి పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 16: తమిళనాడులో గత కొన్ని రోజులుగా కొనసాగిన రాజకీయ అనిశ్చితికి గురువారం తెరపడింది. అన్నాడిఎంకె శాసన సభా పక్ష నాయకుడు, శశికళ విధేయుడు పళనిస్వామిని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు నియమించారు. ఆయనతో పాటు మరో 30మందితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. పక్షం రోజుల్లో అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునే అవకాశం పళనిస్వామికి గవర్నర్ ఇచ్చినప్పటికీ శనివారం నాడే ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. నేడు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు తిరిగి గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పదవి కోసం చివరి క్షణం వరకూ పోరాడిన పన్నీర్‌సెల్వానికి నిరాశే మిగిలింది. బుధవారం వీరిద్దరూ గవర్నర్‌ను కలుసుకున్నారు. తనకు 124మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ వారి జాబితాను గవర్నర్‌కు పళనిస్వామి అందించారు. తనకు సంఖ్యాబలం లేకపోయినా అసెంబ్లీలో బలపరీక్షకు అవకాశం ఇస్తే మెజార్టీ నిరూపించుకుంటానని పన్నీర్‌సెల్వం గవర్నర్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చకచకా రాజకీయ పరిణామాలు సాగిపోయాయి. తమిళనాడు మంత్రులు జయకుమార్, కెఎ సెన్‌గొట్టయ్యన్, టిటి దినకరన్‌లతో కలిసి పళని స్వామి నేటి ఉదయం గవర్నర్‌ను కలుసుకున్నారు. సాయంత్రం నాలుగున్నరకు ముఖ్యమంత్రిగా పళనిస్వామి చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. గతంలో పన్నీర్‌సెల్వం నిర్వహించిన హోం శాఖ, ఆర్థిక శాఖలను పళనిస్వామి చేపట్టారు. అలాగే ప్రజా పనులు, హైవేల శాఖలనూ ఆయనే నిర్వహిస్తారు. శ్రీనివాసన్, సెన్‌గొట్టయ్యన్,కె రాజు,తంగమణి, ఎస్‌పి వేలుమణి, డి జయకుమార్, షణ్ముగం ప్రభృతులు మంత్రులుగా ప్రమాణం చేశారు. పన్నీర్‌సెల్వం మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులందరినీ దాదాపుగా పళనిస్వామి కొనసాగించారు. అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకుంటానని, తన హయాంలో అమ్మ (జయలలిత) ప్రభుత్వమే కొనసాగుతుందని పళనిస్వామి ప్రమాణ స్వీకార అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఓ కుటుంబంలా పళని సారధ్యంలో పనిచేస్తారని అన్నాడిఎంకె ప్రకటించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామిని ప్రధాని మోదీ ఫోన్‌చేసి అభినందించారు. రిమోట్ కంట్రోల్‌లా వ్యవహరించవద్దని, ‘బెంగళూరు’నుంచి ఎలాంటి సలహాలూ స్వీకరించవద్దని పళనిస్వామికి డిఎంకె నేత స్టాలిన్ సూచించారు.

చిత్రం..తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి చేత ప్రమాణం స్వీకారం చేయస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు