జాతీయ వార్తలు

విధేయతే ఆయన బలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 16: జయలలిత మరణానంతరం అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన శశికళపై అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నాటకీయ తిరుగుబాటు చేయడం, జయ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా ప్రకటించడంతో హటాత్తుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా సెంగొట్టియన్‌తో పాటుగా తెరపైకి వచ్చిన ఎడప్పాడి పళనిస్వామి గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని పళనిస్వామి ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా కాగలిగారని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ దాదాపు 40 ఏళ్లపాటు పార్టీకి, జయలలితకు నమ్మినబంటుగాను, సంక్షోభ సమయంలో శశికళకు బాసటగా నిలవడమే ఆయనను ఈ పదవి వరించడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పార్టీలో అట్టడుగు స్థాయినుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంలో 63 ఏళ్ల పళనిస్వామి కృషి తక్కువేమీ కాదు.
ఉత్తర తమిళనాడులోని సేలం జిల్లా నెడుంగుళం గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించిన పళనిస్వామి రాజకీయ జీవితం 1974లో అన్నాడిఎంకెలో సాధారణ కార్యకర్తగా మొదలైంది. పళనిస్వామి గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, తమిళనాడు రాజకీయాల్లో బలమైన రాజకీయ వర్గాల్లో అది ఒకటి కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. పార్టీ అధికార నిచ్చెనలో అంచెలంచెలుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ఆయన 1985లో జయలలితకు మద్దతుగా ఎడప్పాడి ప్రాంతంలో ప్రత్యేక స్వాగత తోరణాలు, జెండాలు ఏర్పాటు చేయడంద్వారా ఆమె దృష్టిని ఆకర్షించారు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజిఆర్ మృతి తర్వాత అన్నాడిఎంకె రెండుగా చీలిపోయినప్పుడు ఆయన జయలలిత పక్షాన నిలవడంద్వారా మరింత దగ్గరయ్యారు. 1990లో జయలలిత అన్నాడిఎంకెలోని రెండు వర్గాలను ఏకం చేసినప్పుడు ఆయనను సేలం నార్త్ జిల్లాకు పార్టీ జాయింట్ సెక్రటరీగా నియమించారు.
సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన పళనిస్వామి 1989, 1991, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజకవర్గంనుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో అన్నాడిఎంకె రాష్ట్రంలో ఘోరపరాజయం పాలయినప్పుడు ఆయన కూడా ఓటమి పాలయ్యారు. అలాగే 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లోను, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లోను ఆయన ఓటమి పాలయ్యారు. అయితే 1998లో తిరుచెంగోడ్‌నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సేలం జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది స్థానాల్లో అన్నాడిఎంకె విజయం సాధించడంతో పార్టీలో పళనిస్వామి పలుకుబడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన సేవలకు గుర్తింపుగా జయలలిత అప్పటికే నిర్వహిస్తున్న హైవేలు, చిన్న రేవుల శాఖతోపాటుగా కీలక పబ్లిక్ వర్క్స్ శాఖను ఆయనకు అప్పగించారు. వాస్తవానికి జయ కేబినెట్‌లో పన్నీర్‌సెల్వం, దిండిగల్ శ్రీనివాసన్‌ల తర్వాతి స్థానం పళనిదే. 2011నుంచి కూడా ఆయన హైవేలు, చిన్నరేవుల శాఖను నిర్వహించడమే కాకుండా జయలలితకు దగ్గరగా ఉన్న నేతల్లో ఒకరుగా కూడా గుర్తింపు పొందారు. జయ మరణం తర్వాత ఆయన శశికళకు మద్దతుగా నిలిచారు. అన్నాడిఎంకెలోను పళనిస్వామి పార్టీ ప్రచార కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీతో సహా వివిధ పదవులు నిర్వహించారు.