జాతీయ వార్తలు

పళనికి పరీక్షే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 17: గత కొన్ని వారాలుగా తమిళనాడును అట్టుడికించిన రాజకీయ అనిశ్చితి, సంక్షోభం నేడు నిర్ణయాత్మక దశకు చేరుకోనున్నాయి. రాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు నిర్ణయంతో ముఖ్యమంత్రిగా నియమితులైన అన్నాడిఎంకె నాయకుడు పళనిస్వామి అత్యంత కీలకమైన బలపరీక్షను శనివారం అసెంబ్లీలో ఎదుర్కోనున్నారు. ఈ పదవికి పోటీపడుతున్న పన్నీర్ సెల్వంనుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోతే చివరి క్షణంలో ఎమ్మెల్యేలు ఆయన గూటికి జారుకోకుండా ఉంటే పళనిస్వామి ఈ విశ్వాసపరీక్షలో సునాయాసంగా నెగ్గే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేడు అసెంబ్లీలో జరగనున్న విశ్వాస పరీక్ష అన్నివిధాలుగా రక్తికట్టించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో సునాయాసంగానే తన మెజారిటీ నిరూపించుకోగలుగుతానన్న ధీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. చివరిక్షణంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా తన ప్రభుత్వ మెజారిటీకి తిరుగు ఉండదని తేల్చిచెప్పారు. ఈ విశ్వాస తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామని 89మంది ఎమ్మెల్యేలు కలిగిన డిఎంకె స్పష్టం చేసింది. మరో పక్క మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అసెంబ్లీలో ఏదో అద్భుతం జరుగుతుందన్న ధీమాతో
ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే కావడంతో పళనిస్వామి విశ్వాసపరీక్షను ఆయన ఏవిధంగానూ ప్రభావితం చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే పళని వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం తనవైపు తిప్పుకోగలిగితే ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అందుకు మాత్రం అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. శశికళ వర్గాన్ని, చివరికి ముఖ్యమంత్రి పళనిస్వామిని కూడా పన్నీర్ సెల్వం వర్గం అన్నాడిఎంకె ప్రాథమిక సభ్యత్వంనుంచి బహిష్కరించడంతో ఈ బలపరీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు పళనిస్వామితోనే ఉన్న ఎమ్మెల్యే ఆర్. నటరాజ్ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పడం దీన్ని నాటకీయ మలుపు తిప్పింది. నటరాజ్ నిర్ణయంతో పళనిస్వామికి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 123కు తగ్గింది. తాను తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడానని, పన్నీర్ సెల్వానికే మద్దతు ఇవ్వాలని వారు స్పష్టం చేయడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నటరాజ్ తెలిపారు. ప్రజాభిమతం దృష్ట్యానే పళనిస్వామి ప్రవేశపెట్టే తీర్మానాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నానన్నారు. అసెంబ్లీలో జరిగేది విశ్వాస పరీక్ష కాదని, ఆత్మప్రబోధ ఓటేనని తెలిపారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. గత మూడు దశాబ్దాల్లో తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగడం ఇదే మొదటిసారి.
ఇటు పళని వర్గాన్ని, అటు పన్నీర్ సెల్వం వర్గాన్ని కలుపుకుంటే అసెంబ్లీలో అన్నాడిఎంకె ఎమ్మెల్యేల మొత్తం సంఖ్య 134. తాను బలపరీక్షను ఎదుర్కోవడానికి గవర్నర్ పక్షం రోజులు గడువిచ్చినప్పటికీ శనివారం నాడే పళనిస్వామి సిద్ధమయ్యారు. రెండురోజుల్లోనే శశికళ వర్గానిదే మెజారిటీ అన్న విషయాన్ని రుజువు చేస్తానని, అందుకే శనివారంనాడే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు పళని వెల్లడించారు. పళనిస్వామికి మద్దతుగా నిలుస్తున్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు చెన్నైకి 80 కి.మీ దూరంలోని కూవత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్‌లోనే ఉన్నారు. వీరు శనివారం ఉదయం ఇక్కడినుంచి అసెంబ్లీకి బయలుదేరే అవకాశం ఉంది. ఉ. 11 గంటలకు బలపరీక్ష జరిగే లోగానే వీరంతా అసెంబ్లీకి చేరుకుంటారు.

మొత్తం స్థానాలు: 234
అన్నాడిఎంకె (పళని వర్గం): 123
అన్నాడిఎంకె (పన్నీర్ వర్గం): 11
డిఎంకె: 89
కాంగ్రెస్: 8
ఇతరులు: 2

చిత్రాలు..గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి పళని స్వామి