జాతీయ వార్తలు

శాఖల కుదింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘కనీస ప్రభుత్వం గరిష్ఠ పరిపాలన’ సూత్రానికి అనుగుణంగా పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలను విలీనం చేయటం, సంస్కరించటం ద్వారా ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒక అంశం పరిధిలోని పలు శాఖలను విలీనం చేయటం ద్వారా ప్రభుత్వ పరిమాణాన్ని కుదించాలని ప్రధాని ఆలోచిస్తున్నారు. మోదీ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు కార్యదర్శుల కమిటీ ఒక నివేదికను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యాచరణ పథకం ప్రకారం మొదట వైద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి శాఖలను సంస్కరించనున్నట్లు తెలిసింది. వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన పని నిర్వహిస్తున్న శాఖలను ఒక మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెస్తారు. ఇదేవిధంగా పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం తదితర కార్యక్రమాలకు సంబంధించిన శాఖలను ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభమైందని అంటున్నారు. కార్యదర్శుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన శాఖలను పట్టణాభివృద్ధి శాఖలో విలీనం చేయటం ద్వారా ఆ శాఖను పటిష్ఠం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదేవిధంగా ఔషధ, ఆయుష్ శాఖలను ఆరోగ్య శాఖలో విలీనం చేయనున్నట్లు తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ శాఖల విలీనం జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సారూప్యత గల శాఖలను విలీనం చేయటం ద్వారా ఏర్పడే సమగ్ర శాఖకు ఏం పేరు పెట్టాలనే అంశాన్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారని అంటున్నారు. సంబంధిత శాఖల విలీనం వలన ఎదురయ్యే ఆర్థిక, పరిపాలనా సంబంధమైన చిక్కులు, ఉద్యోగుల సమస్యలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారనీ, ఈ ప్రక్రియ పూర్తి కాగానే శాఖల విలీనం జరుగుతుందని చెబుతున్నారు. గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలనా శాఖలను పట్టణాభివృద్ధి శాఖలో విలీనం చేసిన తరువాత దీనిని పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ వ్యవహారాల శాఖగా నామకరణం చేయవచ్చునని అంటున్నారు. గతంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన విభాగాలు ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేవి. అయితే ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఈ శాఖను మూడుగా విభజించారు. ఈ మూడు విభాగాలు స్వతంత్రం శాఖలుగా చాలాకాలం నుండి పని చేస్తున్నా, ఆశించిన ఫలితాలు లభించకపోవటంతోపాటు పరిపాలనా వ్యయం బాగా పెరిగింది. అందుకే ఎన్‌డిఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ మూడింటిని ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నది. ఇదే విధంగా ఔషధాల శాఖ, ఆయుష్ శాఖలను ఆరోగ్య శాఖలో విలీనం చేసి దీనికి ఆరోగ్య వ్యవహారాల శాఖగా మారుస్తారని చెబుతున్నారు. ఔషధాల ధరల అథారిటీ ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలో ఉంటే ఔషధాలకు సంబంధించిన అంశాలను ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఆయుర్వేద, యోగా, నాచురోపతి అంశాల నిర్వహణకు ఆయుష్ పేరుతో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పని చేయటం తెలిసిందే. ఔషధాల ధరల నియంత్రణతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నాచురోపతి అంశాలు కూడా ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటే ప్రజలకు సమగ్ర ఆరోగ్య వ్యవస్థ, సేవలను అందజేసేందుకు వీలుంటుందని కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సిపిడబ్లుడి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్లానింగ్, సెంట్రల్ పబ్లిక్ హెల్త్, పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థలను జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థలో విలీనం చేయనున్నట్లు తెలిసింది. పట్టణాభివృద్ధి, ఆరోగ్య శాఖల్లో సంస్కరణలను అమలు చేసిన అనంతరం ఇతర శాఖల అంశాన్ని పరిశీలిస్తారని చెబుతున్నారు.