జాతీయ వార్తలు

త్రుటిలో తప్పిన విమానాల ఢీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 25: అహ్మదాబాద్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. శుక్రవారం సాయంత్రమే ఈ సంఘటన జరిగినప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం టేకాఫ్‌ను చివరి క్షణంలో నిలిపివేయడంతో ప్రమాదం తప్పిపోయింది. ఒక ఇండిగో విమానం రన్‌వేపై నుంచి పూర్తిగా వెళ్లిపోకపోవడాన్ని చివరి క్షణంలో గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పైస్ జెట్ విమానం టేకాఫ్‌ను నిలిపివేయవలసిందిగా సూచించారు. అప్పటికే రన్‌వేపైనుంచి పక్కకు వెళ్లిపోవలసిన ఇండిగో విమానం స్ట్రిప్‌పై కుందేళ్లు అడ్డుగా ఉండటంతో పూర్తిగా పక్కకు వెళ్లలేకపోయింది. ఈ సంఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ దర్యాప్తుకు ఆదేశించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో 142 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో ఆ సంస్థ వెల్లడించలేదు. స్ట్రిప్‌ను ఖాళీ చేసినట్లు ఇండిగో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఎటిసి)కి ధ్రువీకరించిన తరువాతే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎస్‌జి 912 విమానం టేకాఫ్‌కు అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే టేకాఫ్‌కు అనుమతి ఇచ్చిన కొన్ని క్షణాల తరువాత ఇండిగో విమానం ఎగ్జిట్ టాక్సీ ట్రాక్ వద్ద నిలిచిపోయి ఉండటాన్ని గమనించారు. విమానం కొంతభాగం ఇంకా రన్‌వేపైనే ఉండిపోయింది. దీంతో కంట్రోలర్ స్పైస్ జెట్ విమానాన్ని రన్‌వేపైనుంచి వెనక్కి తీసుకెళ్లాల్సిందిగా పైలట్‌ను ఆదేశించారు. దీంతో ఆ విమానం పైలట్ చివరిక్షణలో విమానాన్ని టేకాఫ్ చేయకుండా నిలిపివేశాడని అధికార వర్గాలు తెలిపాయి. మరో విమానం రన్‌వేపై ఉండటంతో చివరి క్షణంలో తమ విమానం టేకాఫ్‌ను నిలిపివేసినట్లు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే రెండు విమానాలు బాగా ఎడంగానే ఉన్నాయని ఇండిగో అధికార ప్రతినిధి పేర్కొన్నారు. బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వచ్చిన తమ విమానం 6ఇ-166 అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23పై ల్యాండ్ అయిందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. టాక్సీవే మీదుగా వెళ్లిపోవాలని ఎటిసి సూచించగా, అదేవిధంగా రన్‌వేను ఖాళీ చేయడానికి ఉపక్రమించిందని తెలిపింది. అయితే విమానం కొంతదూరం పోయాక స్ట్రిప్‌పై కొన్ని కుందేళ్లు ఉండటాన్ని విమాన సిబ్బంది గమనించి, విమానాన్ని నిలిపివేశారని పేర్కొంది. దీంతో విమానం ముందు భాగం టాక్సీవేలో ఉండగా, వెనుక భాగం మాత్రం రన్‌వేపైనే ఉండిపోయిందని వివరించింది.