జాతీయ వార్తలు

11న ఆ మూడు పార్టీలకు కరెంట్ షాకులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్జాపూర్, మార్చి 3: ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు కరెంట్ షాక్‌లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాపై బిజెపి, సమాజ్‌వాది పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన తూర్పు యూపీలోని మీర్జాపూర్‌లో శుక్రవారం జరిగిన ఓ ఎన్నికల సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మార్చి 11న ఎన్నికల ఫలితాలు ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు కరెంట్ షాక్‌లు ఇస్తాయి’ అని మోదీ అన్నారు. ‘కరెంట్ సరఫరా ఉందో లేదో చూడడం కోసం దమ్ముంటే కరెంట్ వైర్ తాకి చూడమని అఖిలేష్ యాదవ్ నన్ను సవాలు చేశారు. అయితే ఆయన కొత్త స్నేహితుడు రాహుల్ గాంధీ గతంలో మీర్జాపూర్‌లోని మదిహాన్‌లో జరిగిన ఖాత్ సభలో కరెంట్ వైర్ తాకి చూసి విద్యుత్ లైన్‌లో కరెంట్ లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదని తమ పార్టీ నేత గులాం నబీ ఆజాద్‌కు చెప్పారు’ అని గతంలో రాహుల్ గాంధీ అన్న మాటలను ప్రధాని గుర్తు చేశారు. ‘మీ కొత్త మిత్రుడే ఆ విషయాన్ని అంగీకరించారు. ఇప్పుడు నేరు కరెంట్ వైర్లు తాకాల్సిన అవసరం ఉందా? ఇప్పు డు జనం మార్చి 11వ తేదీన ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్‌లు తగిలేలా ఒక కరెంట్‌ను వ్యాప్తి చేశారు’ అని ముఖ్యమంత్రి అఖిలేష్‌నుద్దేశించి ప్రధాని అన్నారు. రాహుల్ గాంధీ ఖాత్ సభలో జనం మంచాలు తీసుకెళ్లారు, ఎందుకంటే మంచాలు తమకు చెందినవని వాళ్లకు తెలుసునని, ఇప్పుడు అదే జనం కాంగ్రెస్‌ను ఓడించబోతున్నారని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆరోవిడత పోలింగ్ శనివారం జరగనుండగా, ఈ నెల 8న చివరి విడత పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించారని మోదీ అన్నారు. ‘ఒక వేళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నా, లేదా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయకుండా ఉండడానికి ఎంత చెల్లించాలో రేటు నిర్ణయించి ఉంటారు. అలాగే పెన్షన్లు ఉద్యోగాలు, రేషన్ కార్డులు పొందడానికి కూడా రేట్లు నిర్ణయమై ఉంటాయి’ అని ప్రధాని అన్నారు. దీనికి పరిష్కారం అవినీతిని ఓడించడమేనని అవినీతి రకాలపై ఓ ప్రముఖ హిందీ కవి రాసిన గేయాన్ని ఉటంకిస్తూ మోదీ చెప్పారు. ‘మీరుగనుక అవినీతిని అంతమొందించాలనుకుంటే ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించండి’ అని అన్నారు. బిఎస్పీ అధినేత్రి మాయావతిపైనా మోదీ ధ్వజమెత్తుతూ తన విగ్రహాల నిర్మాణం కోసం ఆమె ఇక్కడినుంచి రాళ్లు తీసుకెళ్లారని, అయితే దర్యాప్తు మొదలుకాగానే ఆ రాళ్లు రాజస్థాన్‌నుంచి తెప్పించామని చెప్పారన్నారు. ‘మీర్జాపూర్ రాళ్లన్నా ఆమెకు ఎందుకింత ద్వేషమో మీరే చెప్పండి? అలాంటి వాళ్లకు మీరు ఓటు ఎందుకు వేయాలి?’ అని సభకు హాజరయిన జనాన్ని ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. అంతేకాదు, ఈ పార్టీలకు చెందిన ఒక్క అభ్యర్థి కూడా విధాన సభలో అడుగుపెట్టకుండా చూడాలని కూడా కోరారు. మీర్జాపూర్‌లో ఇత్తడి పరిశ్రమను ఈ పార్టీలు నాశనం చేశాయని ప్రధాని అన్నారు.
‘ఆ పరిశ్రమే గనుక పని చేస్తూ, విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగి ఉంటే ఈ ప్రాంతంనుంచి యువకులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్టల్రకు వలస వెళ్లి ఉండే వారు కాదు. కులతత్వం, బంధుప్రీతి కారణంగా యుపిలో యువకులు ఉద్యోగాలు లభించడం లేదు’ అని ప్రధాని మోదీ అన్నారు.

చిత్రం..మీర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ