జాతీయ వార్తలు

భవ్య భారతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: భవ్య, దివ్య భారత నిర్మాణం లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం పేర్కొన్నారు. దేశ సమగ్ర అభివృద్ధి ఒక్కటే మా అజెండా అని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణం చేసిన సందర్భం గా ఆ సమారోహానికి హాజరైన మోదీ ఆ తరువాత వరుస ట్వీట్లతో యుపి కొత్త సి ఎంను, ఆయన మంత్రివర్గ సహచరులను అభినందించారు. హిందుత్వ అతివాది ముద్ర ఉన్న ఆదిత్యనాథ్‌కు సిఎం పదవి కట్టబెట్టడంపై వచ్చిన విమర్శల తీవ్రతను తగ్గించే దిశగా మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆదిత్యనాథ్‌కు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ వౌర్య, దినేశ్ శర్మ, ఇతర మంత్రులకు ఆయన అభినందనలు తెలిపారు. ‘‘మా ఒకే ఒక్క మిషన్ అభివృద్ధి. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరప్రదేశ్ యువతకు తగిన అవకాశాలు కల్పించటం ప్రధాన అజెండా’’ అని ఆయన పేర్కొన్నారు. ‘యుపిలో అధికారాన్ని చేపట్టిన ఈ కొత్త బృందం ఈ రాష్ట్రాన్ని ఉత్తమ్‌ప్రదేశ్‌గా తీర్చిదిద్దుతుందని విశ్వసిస్తున్నా. ప్రజల ఆశీస్సులు, బిజెపి కార్యకర్తలు కష్టించి పనిచేయటం వల్లనే నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం.’’ అని మోదీ అన్నారు.
కొలువుదీరిన యోగి కేబినెట్
అంతకు ముందు మధ్యాహ్నం 2గంటలకు యుపి 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని కాన్షిరామ్ స్మృతి ఉపవనంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రామ్ నాయక్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దీనితో 15 ఏళ్ల పాటుగా రాష్ట్రంలో అధికారానికి దూరమైన బిజెపి మళ్లీ అధికారం చేపట్టినట్లయింది. ఆదిత్యనాథ్‌తో పాటుగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ వౌర్య, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మలు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సహా 46 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 22 మంది కేబినెట్ మంత్రులు కాగా, 9 మందికి స్వతంత్ర హోదా 15 మందికి సహాయ మంత్రి హోదా దక్కింది.
ఎలాంటి పాలనానుభవం లేని 44 ఏళ్ల ఆదిత్యనాథ్‌ను శనివారం జరిగిన బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొత్తగా ఎన్నికయిన పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని నిర్ణయించే విషయంలో బిజెపి అధిష్ఠానంపై ఆర్‌ఎస్‌ఎస్ పలుకుబడి బాగా పని చేసిందనే మాట కూడా బలంగా వినిపిస్తోంది.
కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీతో పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆదిత్యనాథ్ వేదికపై ఉన్న ప్రధాని, అమిత్‌షా, అద్వానీల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేయగా వారు ఆయనను అభినందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ తదితర ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే బిఎస్పీ అధినేత్రి మాయావతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన రీటా బహుగుణకు, బిఎస్పీ నేత స్వామి ప్రసాద్ వౌర్యకు మంత్రివర్గంలో చోటు లభించింది. రీటా బహుగుణ లక్నోకంటోనె్మంట్‌లో ములాయం సింగ్ కోడలు అపర్ణాయాదవ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్‌కు, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఒకే ఒక ముస్లిం మొహిసిన్ రజాకు కేబినెట్‌లో చోటు దక్కింది. మాజీ క్రికెటర్ అయిన రజా రాష్ట్ర ఉభయ సభల్లోను సభ్యుడు కాకపోవడం విశేషం.
ఒకే వేదికపై ఆ ముగ్గురు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరస్పరం పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకున్న నేతలు మోదీ, అఖిలేశ్, ములాయంలు ఆదివారం ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార వేదికపై కలిశారు. పరస్పరం ఆలింగనాలు చేసుకుంటూ అభినందించుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత అఖిలేష్, ములాయంలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయనను కలిశారు.. కరచాలనాలు చేసి కుశల ప్రశ్నలు వేశారు. మోదీ సైతం నవ్వుతూ అఖిలేష్‌తో కరచాలనం చేసిన అనంతరం ఆప్యాయంగా ఆయన భుజం తట్టారు. మోదీ, ములాయం సింగ్‌లయితే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

చిత్రం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్