జాతీయ వార్తలు

ఆదిత్యనాథ్ ఎన్నికలో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జోక్యం చేసుకోలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభాపక్ష నేత ఎన్నిక కార్యక్రమానికి వెంకయ్య నాయుడు పార్టీ కేంద్ర పరిశీలకునిగా హాజరైన విషయం తెలిసిందే. అయితే కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేయడం విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఆయన ఎంపిక విషయమై పార్టీ శాసనసభ్యులే నిర్ణయం తీసుకున్నారని, తమ పార్టీ గొప్పతనం అదేనని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ప్రతిపక్షాలు హుందాగా స్వీకరించి ప్రజల తీర్పును శిరసావహించడంతో పాటు కొత్త ముఖ్యమంత్రికి సముచిత అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ‘ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆధ్వర్యంలో తమ నేతను నిర్ణయించుకున్నారు. మా పార్టీ గొప్పతనం అదే. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకోవడంగానీ, ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరునూ సూచించడంగానీ చేయలేదు’ అని వెంకయ్య నాయుడు సోమవారం పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. శాసనసభకు ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన తర్వాత వారి అభిప్రాయాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తెలియజేశానని, ఆ తర్వాత ఎమ్మెల్యేలతో తాను నిర్వహించిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ పేరును సురేష్ ఖన్నా ప్రతిపాదించగా, మరో తొమ్మిది మంది ఆ ప్రతిపాదనను బలపర్చారని, అనంతరం ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ఆదిత్యనాథ్ పేరును ఏకగ్రీవంగా అంగీకరించారని, వారి నిర్ణయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదించిందని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎస్ మనిషిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిందని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి లాంటి విపక్ష నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు పైవిషయాలను స్పష్టం చేశారు.