జాతీయ వార్తలు

బ్యాంకు చార్జీలు రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కల్పించిన క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపును కాల పరిమితి లేకుండా మొదటి విక్రయానికి కల్పించాలని తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు డిమాండ్ చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్న డిజిటల్ చెల్లింపుల విధానం ప్రాచుర్యం పొందాలంటే బ్యాంకు చార్జీలను తొలగించాలని ఆయన సూచించారు. ఆయన మంగళవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఈ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపును రెండు సంవత్సరాలకు మాత్రమే కల్పించారు, దీని వలన రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదు, కాబట్టి కాల పరిమితి లేకుండా మొదటి విక్రయానికి దీనిని వర్తింపజేయాలని ఆయన కోరారు. ఖాతాదారులు నిర్వహించే ప్రతి లావాదేవీపై చార్జీలు విధిస్తున్నారు, దీని వలన డిజిటల్ లావాదేవీలు ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. పది మంది మధ్య పది రూపాయలు ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు జరిగితే వెయ్యి లావాదేవీల అనంతరం ఈ పది రూపాయలు మాయమైపోతున్నాయి, అంటే బ్యాంకులు డిజిటల్ లావాదేవీలపై విధిస్తున్న చార్జీల మూలంగా ఖాతాదారులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని రామమోహన్ నాయుడు వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలకు ప్రయోజనం కలుగకుండా బ్యాంకులకు లాభం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ పద్దతిలో లావాదేవీలు నిర్వహించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదించటం ద్వారా దీని అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రైల్వే శాఖకు పలు సంవత్సరాలు ప్రత్యేక బడ్జెట్‌ను పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదించటంలో తప్పు లేదని ఆయన వాదించారు. అమెరికాలో భారతీయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో నెలకొన్న జాతి వివక్ష మూలంగా అక్కడ నివసిస్తున్న ఎంతో మంది తెలుగు వారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు, ప్రభుత్వం సరైన వాతావరణాన్ని కల్పించటం ద్వారా వీరి నుండి ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. గతంలో మన నిపుణులు అమెరికా వెళ్లిపోవటం వలన బ్రేన్ డ్రేయిన్ జరిగేదే ఇప్పుడు బ్రేయిన్ గెయిన్ జరిగే అవకాశాలున్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితిని 3 నుండి మూడున్నర శాతానికి పెంచాలని కోరారు. రాజస్తాన్‌కు పెట్రోలు, సహజవాయువు నిక్షేపాల మూలంగా ప్రతి సంవత్సరం ఏడు వేల కోట్ల రూపాయలు లభిస్తున్నాయి, అయితే కె.జి బేసిన్ ఉన్నా తమ రాష్ట్రానికి నయాపైస లభించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మా భూమి వాడుకుంటారు, మా భూముల నుండి పైపులు వేసుకుంటారు కానీ మాకు నయా పైస ఇవ్వరు ఏమిటిది? అని నాయుడు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి కనీసం ఇరవై వేల కోట్లు అవసరమవుతాయి, కొత్త రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున సహాయం చేయాలని ఆయన విజప్తి చేశారు. జి.ఎస్.టిని స్వాగతించిన ఆయన లోక్‌సభకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించారు.