జాతీయ వార్తలు

తొలిరోజే రచ్చ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఎన్టీయే ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సోమవారం మొదలైన పార్లమెంటులో కాంగ్రె స్ పెద్దపెట్టున దుమారం రేపింది. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద బైటాయిస్తే, రాజ్యసభలో మాత్రం పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో ఉభయ సభల్లోని కార్యక్రమాలు స్థంభించాయి. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటాన్ని ఖండించే తీర్మానానికి రాజ్యసభ ఆమోదముద్ర వేసేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. పెద్దఎత్తున కాంగ్రెస్ గొడవకు దిగడంతో నాలుగుసార్లు వాయిదాపడిన రాజ్యసభ, తరువాత మంగళవారానికి వాయిదాపడింది. సోమవారం పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటంపై కాంగ్రెస్ గొడవ చేసింది. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరిపేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేయాలని లోకసభలో కాంగ్రెస్‌పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గందరగోళం మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగించారు తప్ప సభ వాయిదాకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ సీనియర్లు మల్లిఖార్జున ఖర్గే, వీరప్పమొయిలీ సహా సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. మాజీ మంత్రి శశిథరూర్ తటపటాయిస్తుంటే, గమనించిన సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో థరూర్‌కు సైతం పోడియం వద్ద బైఠాయించక తప్పలేదు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగినంత సేపూ కాంగ్రెస్ ఆందోళన కొనసాగించింది. ప్రధాని మోదీ నిరకుంశత్వం పని చేయదని, బిజెపి దాదాగిరి సాగనివ్వమంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలిచ్చారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అనుమతి ఇస్తామంటూ నచ్చజెప్పినా కాంగ్రెస్ వినలేదు. దీంతో వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్టు ప్రకటించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించే కార్యక్రమం పూర్తిచేసిన అనంతరం మల్లిఖార్జున ఖర్గేకు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. బిజెపి ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ముందు ముందు తీవ్ర పరిణామాలు తప్పవని ఖర్గే హెచ్చరించారు. దీనికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బదులిస్తూ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల వల్లే ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించాల్సి వచ్చిందన్నారు. ఉత్తరాఖండ్ పరిణామాలకు బిజెపి ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు కొందరు బయటకు వెళ్లిపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున దీనిపై సభలో చర్చ జరిపేందుకు అవకాశం లేదన్నారు. అయితే మల్లిఖార్జున ఖర్గే ఈ అభిప్రాయంతో ఏకీభించలేదు. గతంలో సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్న అంశాలపై సభలో పలుమార్లు చర్చ జరిగిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. స్పీకర్ అనుమతి ఇస్తే ఈ అంశంపై చర్చ జరపొచ్చని వాదించారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయన వాదనతో ఏకీభవించలేదు.
రాజ్యసభలో గొడవ
ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటాన్ని ఖండించే తీర్మానాన్ని కాంగ్రెస్‌పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ ప్రతిపాదించారు. తీర్మానంపై చర్చ జరిపి ఆమోదించాలని ఆనంద్ శర్మతోపాటు ఇతర కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. అయితే చైర్మన్ హమీద్ అన్సారీ మాత్రం అందుకు సమ్మతించలేదు. దీనికి ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి గొడవ చేయటంతో రాజ్యసభ గందరగోళంలో పడింది. కాంగ్రెస్ సభ్యులు ఎంఏ ఖాన్, వి హనుమంతరావు తదితరులు పోడియం వద్దకు దూసుకొచ్చి ఉత్తరాఖండ్ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు బిజెపి రాజకీయ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ స్పీకర్ పిజె కురియన్ కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సభను 12 గంటల వరకూ వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యసభ 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకొచ్చి గొడవ చేశారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటాన్ని తీవ్రంగా ఖండించారు. సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ ప్రతిపక్షం సభ్యులను శాంతింపజేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లేచి రాష్ట్ర గవర్నర్ పనితీరుపై విడిగా నోటీసు ఇస్తే చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమేనని ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వినకపోవటంతో, హమీద్ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యసభ మధ్యాహ్నం సమావేశమైనప్పుడూ కాంగ్రెస్ గొడవకు దిగింది. దీంతో రాజ్యసభ మరో రెండుసార్లు వాయిదా పడిన తరువాత 3 గంటల సమయంలో మంగళవారానికి వాయిదా పడింది.

చిత్రం ఉత్తరాఖండ్ అంశంపై రాజ్యసభలో వాడివేడిగా సాగుతున్న చర్చ.
తొలిరోజు పార్లమెంట్‌కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ