జాతీయ వార్తలు

ఎంపీ సీట్లు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: పెరిగిన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ స్థానాలు పెంచుకోవాల్సిన అవసరముందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ‘ఎన్నికల ప్రక్రియలో ఆర్థిక సంస్కరణలు’ అనే అంశంపై భారత న్యాయవాదుల సమాఖ్య ఏర్పాటు చేసిన సదస్సులో రాష్టప్రతి అధ్యక్షోపన్యాసం చేస్తూ, ఈమేరకు సూచించారు. 1971లో అప్పటి జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల సంఖ్యను సవరించారని, అయితే దేశ జనాభా ఎంతో పెరిగినా వారికి ప్రాతినిధ్యం వహించే ఎంపీల సంఖ్య పెరగలేదని ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించారు. దేశంలోని 130 కోట్ల మందికి కేవలం 543 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని అభిప్రాయపడ్డారు. పెరిగిన జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాలు పెంచుకోవాలని, ఇందుకు సంబంధించి చట్టపరమైన అంశాలను పరిశీలించాలని సూచించారు. భారత్‌కంటే తక్కువ జనాభా కలిగిన గ్రేట్ బ్రిటన్‌కు 600కంటే ఎక్కువ ఎంపీలు ఉన్నపుడు, 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఎంపీ స్థానాలను ఎందుకు పెంచుకోకూడదని ప్రశ్నించారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచుకునేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు చట్టపరమైన అంశాలు పరిశీలించాలని హితవు పలికారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేందుకు ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సిన ఉన్నదని ప్రణబ్ ప్రతిపాదించారు. కాలానుగుణంగా ఎన్నికల సంస్కరణలు చేసుకుంటే దేశ ప్రజలకు న్యాయం కలగటంతోపాటు రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదర్శాలు కూడా పటిష్టం అవుతాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్దుకునేందుకు నిష్పక్షపాతమైన విశే్లషణ అవసరమని రాష్టప్రతి సూచించారు. నిష్పాక్షిక విశే్లషణల ద్వారానే ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. గతంలో కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరతకు దోహదపడ్డాయని ప్రణబ్ విశే్లషించారు. అస్థిర ప్రభుత్వాల కారణంగానే లోక్‌సభకు తరచూ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ఓటర్లకూ బాధ్యత ఉంటుందని అంటూ, పార్లమెంటు కేవలం చర్చలు జరిపే వ్యవస్థ మాత్రమే కాదని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ అని రాష్టప్రతి ఉద్భోదించారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కెహెర్ మాట్లాడుతూ ఎన్నికల హామీల ఉల్లంఘనకు రాజకీయ పార్టీలను బాధ్యులు చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

చిత్రం..‘ఎన్నికల ప్రక్రియలో ఆర్థిక సంస్కరణలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రణబ్