జాతీయ వార్తలు

జాదవ్‌ను కాపాడుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని పార్లమెంట్ ఉభయ సభల్లో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. జాదవ్‌పై గూఢచారిగా ముద్రవేసిన పాకిస్తాన్ సైనిక కోర్టు ఆయనకు మరణ దండన విధించిన నేపథ్యంలో ఈ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలో మంగళవారం విస్తృత చర్చ జరిగింది. పాక్ నిర్ణయాన్ని ఖండించిన రాజకీయ పార్టీలు జాదవ్‌ను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెచ్చాయి. తమ ప్రోద్బలంతో సాగుతున్న ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల దృష్టి మళ్లించేందుకే పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడిందని, జాదవ్‌ను గూఢచారిగా పేర్కొంటూ అతడికి మరణ శిక్ష ఖరారు చేసిందని ఇటు ప్రభుత్వం, అటు విపక్షాలు స్పష్టం చేశాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే అన్ని పార్టీలకు చెందిన సభ్యులు పాకిస్తాన్ చర్యను తీవ్ర స్వరంతో గర్హించాయి. జాదవ్ అంశంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేక పోయిందంటూ సర్కార్‌పై విపక్షాలు విరుచుకు పడ్డాయి. అధికార పక్షం ఈ ఆరోపణను తిప్పికొట్టింది. జాదవ్‌ను రక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ చేపడుతుందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయనకు మరణ శిక్ష విధించడం ద్వారా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను, చట్టాన్నీ పాక్ ఉల్లంఘించిందన్నారు. అసలు ఇప్పటి వరకూ ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు వౌనం వహించిందని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.ఎలాంటి ఆహ్వానం లేకుండానే పాకిస్తాన్ ప్రధాని కుమార్తె పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లే ప్రధాని మోదీకి జాదవ్ అంశాన్ని ప్రస్తావించే తీరికే లేకపోయిందని పరోక్షంగా ధ్వజమెత్తారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు పాకిస్తాన్ దర్యాప్తు బృందాన్ని భారత్ అనుమతించిందని, జాదవ్‌కు మాత్రం ఎవర్నీ సంప్రదించే అవకాశానే్న ఆ దేశం ఇవ్వలేదని ఖర్గే అన్నారు. దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘జాదవ్ విషయంలో మన మధ్య వివాదాలు వద్దు. పాకిస్తాన్ చర్యను మనమంతా ముక్తకంఠంతో ఖండించాలి’అని ఉద్ఘాటించారు. జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించడం అంతర్జాతీయ చట్టానికే విరుద్ధమని కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు శశిథరూర్ అన్నారు. పాక్‌తో తన సంబంధాలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేదని ఇప్పుడు జాదవ్ అంశాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని థరూర్ అన్నారు.

చిత్రాలు..రాజ్‌నాథ్ సింగ్* మల్లికార్జున ఖర్గే