జాతీయ వార్తలు

అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బిజెపి విజయ ఢంకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఎనిమిది రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. శ్రీనగర్ పార్లమెంటు స్థానంతోపాటుగా వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు గత ఆదివారం జరగ్గా, గురువారం ఫలితాలు వెలువడ్డాయి. కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో రెండేసి స్థానాలకు, పశ్చిమ బెంగాల్, అసోం, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, బిజెపి అయిదుచోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు స్థానాలను దక్కించుకొంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ స్థానంలో ఘన విజయం సాధించడం బిజెపికి నైతిక విజయంగా భావించవచ్చు. ఇక్కడ బిజెపి-శిరోమణి అకాలీదళ్ ఉమ్మడి అభ్యర్థి మంజిత్ సింగ్ సిర్సా దాదాపు 24 వేల ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి చందేలా రెండో స్థానంలో నిలవగా, అధికార ఆమ్ ఆద్మీ
పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ అభ్యర్థి హరిజీత్ సింగ్‌కు కేవలం 10 వేల ఓట్లే రావడంతో ధరావతు కోల్పోయారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే జర్నాలీ సింగ్ రాజీనామా చేసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి బిజెపి అభ్యర్థి శివనారాయణ్ సింగ్ 25వేల భారీ మెజారిటీతో విజయం సాధించగా, కాంగ్రెస్, బిజెపిల మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ సాగిన అటెర్ నియోజకవర్గంలో బిజెపి విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి హేమంత్ కటారే కేవలం 856 ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని కాంతిదర్శన్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య విజయం సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని భోరంజ్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి డాక్టర్ అనిల్ ధిమాన్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీలా దేవిపై ఘనవిజయం సాధించారు. ఇక్కడినుంచి ఆరుసార్లు నెగ్గిన బిజెపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఈశ్వర్‌దాస్ ధిమన్ మృతి చెందగా, ఇప్పుడు ఆయన కుమారుడు విజయం సాధించారు. అసోంలోని ధేమాజీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రనోజ్ పేగు కాంగ్రెస్ ప్రత్యర్థి బాబుల్ సోనోవాల్‌పై 9,285 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రధాన్ బరువా లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గంనుంచి గెలుపొందడంతో ఇక్కడ ఉపఎన్నిక అవసరమైంది. జార్ఖండ్‌లోని లిటిపారా నియోజకవర్గంలో జెఎంఎం అభ్యర్థి సైమన్ మరాండి గెలుపొందారు.
మరోవైపు కర్నాటకలో ఉప ఎన్నికలు జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. నంజన్‌గూడ్‌లో కాంగ్రెస్‌కు చెందిన కలాలె ఎన్ కేశవమూర్తి తన సమీప బిజెపి ప్రత్యర్థి వి శ్రీనివాస ప్రసాద్‌పై 21వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. మాజీ మంత్రి అయిన శ్రీనివాస ప్రసాద్ తనను మంత్రివర్గంనుంచి తొలగించడంతో కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. గుండ్లుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహదేవ ప్రసాద్ బిజెపి ప్రత్యర్థి సిఎస్ నిరంజన్ కుమార్‌ను పదివేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపిలు రెండూ ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాగా, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి శోభారాణి భారీ మెజారిటీతో గెలుపొందారు.