జాతీయ వార్తలు

ఉగ్రవాదం ఓ పెనుముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: నిరంతరం క్రమంగా పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు ఉభయ దేశాలను కలవరపరుస్తున్న అంశమని భారత్, టర్కీ పేర్కొన్నాయి. ఉగ్రవాదం సరయిందని, సక్రమమయిందని చెప్పగలిగే కారణం లేదా హేతువు ఏదీ లేదని పేర్కొన్నాయి. ఉగ్రవాద శక్తులకు ఆశ్రయమిచ్చే, మద్దతిచ్చేవారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గట్టిగా చెప్పాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత పర్యటనకు వచ్చిన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సోమవారం ఇక్కడ సమగ్ర చర్చలు జరిపారు. రాజకీయ, ఆర్థిక సంబంధాలుసహా అన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అనంతరం ఎర్డోగన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేఖరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ ‘మన సమాజాలు ప్రతిరోజు కొత్త ముప్పులను, సవాళ్లను ఎదుర్కొంటున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రపంచంలో ఇప్పటికే ఉన్న, ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లలో కొన్నింటి పూర్వాపర సంబంధాలు, స్వరూపాలు ఉభయ దేశాలను కలవరపరుస్తున్నాయి’ అని అన్నారు. ‘ప్రత్యేకంగా, ఉగ్రవాదం నుంచి స్థిరంగా పెరుగుతున్న ముప్పు ఉభయ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది’ అని పేర్కొన్నారు. ‘నేను టర్కీ అధ్యక్షుడితో ఈ అంశంపై విస్తృతంగా చర్చించాను. ఏ ఉద్దేశం లేదా లక్ష్యం లేదా కారణం కూడా ఉగ్రవాదాన్ని సరైందిగా, సక్రమమైందిగా చేయజాలదనే అభిప్రాయంతో మేమిద్దరం అంగీకరించాం’ అని మోదీ అన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వారి ఆర్థిక వనరులను ధ్వంసం చేయవలసిన అవసరం ఉందని, ఉగ్రవాదుల సీమాంతర కదలికలను అడ్డుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఉగ్రవాద జాడ్యాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మా సహకారాన్ని పటిష్ఠపరచుకునేందుకు కలిసి పనిచేయాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, నేను అంగీకరించాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదంపై యుద్ధంలో భారత్‌కు వెన్నుదన్నుగా మా దేశం నిలుస్తుంది.. ఉగ్రవాదులు వారు పారించిన రక్తంలోనే మునిగి చస్తారు’ అని ఎర్డోగన్ అన్నారు. రెండు రోజుల పర్యటనకోసం ఎర్డోగాన్ ఆదివారం ఇక్కడికి వచ్చారు. టర్కీలో ఏప్రిల్ 16న నిర్వహించిన రెఫరెండంలో నెగ్గిన తరువాత ఎర్డోగాన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే.
చిత్రం.. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సంయుక్త విలేఖరుల సమావేశంలో
ప్రధాని నరేంద్ర మోదీని హత్తుకుంటున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్