జాతీయ వార్తలు

రగిలిన ప్రతీకారేచ్ఛ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరన్‌తరన్ (పంజాబ్), మే 2: జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో సోమవారం పాక్ సైనికుల చేతిలో దారుణంగా హత్యకు గురయిన జవాను నరుూబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్‌కు మంగళవారం తరన్‌తరన్ జిల్లాలోని ఆయన స్వస్థలమైన వైన్‌పోయిన్ గ్రామంలో పూర్తిస్థాయి సైనిక మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించారు. 22 సిఖ్ రెజిమెంట్రీకి చెందిన 42 ఏళ్ల పరమ్‌జిత్‌తో పాటుగా బిఎస్‌ఎఫ్ 200 బెటాయలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్‌సాగర్‌లను పాక్ సైన్యం దారుణంగా చంపి వారి తలలనుంచి మొండేలను వేరు చేసిన విషయం తెలిసిందే. పరమ్‌జిత్ స్వగ్రామానికి చెందినవారే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకునుంచి పెద్ద సంఖ్యలో జనం వీర జవానుకు తుది వీడ్కోలు పలకడానికి వచ్చారు. ఆర్మీ, సివిల్ ఉన్నతాధికారులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సైనికులు తుపాకులు గాలిలోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు.
త్రివర్ణ పతాకం కప్పిన పరమ్‌జిత్ మృతదేహాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఊరేగింపుగా శ్మశానానికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని తమకు చూపించాలని పరమ్‌జిత్ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో అంత్యక్రియలు కొద్దిసేపు ఆగిపోయాయి. అయితే ఆర్మీ, సివిల్ అధికారులు నచ్చజెప్పడంతో కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గారు. పరమ్‌జీత్ సింగ్‌కు వృద్ధులయిన తల్లిదండ్రులు, భార్య పరమ్‌జిత్ కౌర్ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలంతా 11నుంచి 14 ఏళ్ల లోపు వయసువారే. వచ్చే వారం సెలవుపై గ్రామానికి రావలసిన పరమ్‌జీత్ మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయిన ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు పాకిస్తాన్‌కు తగిన రీతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యులను కలవడానికి కానీ, అంత్యక్రియలకు కానీ ప్రభుత్వంలోని సీనియర్ నేతలెవరు కూడా రాకపోవడంపై పరమ్‌జీత్ భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పడానికి సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.
కాగా, తన దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన కుమారుడ్ని చూసి గర్విస్తున్నానని పరమ్‌జీత్ తండ్రి ఉధమ్ సింగ్ అన్నారు. మిగతా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గ్రామస్థుల్లో పాకిస్తాన్ పట్ల ఆగ్రహం కొట్టొచ్చినట్లు కనిపించింది. ‘షహీద్ పరమ్‌జీత్ అమర్ రహే’ అన్న నినాదాలతో పాటుగా ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అనే నినాదాలు మిన్నుముట్టడమే దీనికి నిదర్శనం.

చిత్రం..భారత జవాన్ల హత్యలకు నిరసనగా మంగళవారం ఢిల్లీలో పాక్ ప్రధాని నవాజ్ షరీప్, ఆర్మీ చీఫ్ జావెద్ బాజ్వాల ఫోటోలను తగులబెడుతున్న హిందూ సేన కార్యకర్తలు