జాతీయ వార్తలు

చైనాలో కీలక సదస్సు.. భారత్ డుమ్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: ‘ఒకే కారిడార్ ఒకే రహదారి’ (ఒన్ బెల్ట్ ఒన్ రోడ్) అనే అంశంపై చైనా నిర్వహించనున్న శిఖరాగ్ర సదస్సుకు తమ ప్రతినిధినెవరినీ పంపకూడదని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదివారంనుంచి జరగనున్న ఈ రెండు రోజుల సదస్సుకు చైనా పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, అమెరికా సహా దాదాపు 29 దేశాలకు ఆహ్వానాలు పంపింది. ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్‌లు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అమెరికా సైతం ఈ సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. ఈ సదస్సుకు హాజరు కాకూడదని ఇంతకుముందు అనుకున్న అమెరికా ఇప్పుడు తన వైఖరిని మార్చుకుని సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఒక విధంగా చైనా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కొత్త బలం చేకూరినట్లేనని భావిస్తున్నారు. వైట్‌హౌస్ సలహాదారు మ్యాట్ పోట్టింగర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.
సరిహద్దులగుండా రైల్వేలు, విమానయానం, రోడ్డు మార్గాల ద్వారా చైనానుంచి యూరప్ వరకు ఒకే రవాణా కారిడార్‌ను నిర్మించాలన్నది చైనా యోచన. వేల కోట్ల డాలర్లు ఖర్చయ్యే ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా మధ్యలో ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సిపిఇసి) ఏర్పాటుకు చైనా చర్యలు ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లనుండడంపట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత సార్వభౌమాధికారం కింద ఉండే భూభాగమని, దీన్ని పాక్ అక్రమించుకుందనేది మన దేశం వాదన. అయితే చైనా ఈ వాదనను కొట్టి పారేస్తూ, ఈ సమస్యను సార్వభౌమాధికారం కోణంలో కాక ఆర్థిక కోణంలో చూడాలని అంటోంది. అంతేకాదు తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే చైనా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తెరపైకి తీసుకువస్తోందన్న ఐరోపా దేశాల అనుమానాలను సైతం చైనా తోసిపుచ్చుతూ, ఈ ప్రాజెక్టులో ఎవరైనా పాలు పంచుకోవచ్చని, ఆర్థిక ప్రయోజనాలే దీని ప్రధాన లక్ష్యమని అంటోంది. అయితే అణు సరఫరా దేశాల గ్రూపులో చేరడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం, అలాగే భారత్‌లో అనేక ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్న పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై ఆంక్షలకోసం ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని వీటో చేయడం లాంటి చర్యల కారణంగా చైనాకు తన నిరసనను స్పష్టంగా తెలియజేయడానికి ఈ సదస్సుకు గైరుహాజరు కావాలని భారత్ నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
అయితే విదేశాంగ శాఖ మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం. కాగా, చైనాకు దీర్ఘకాలంగా మిత్ర దేశాలుగా ఉన్న పలు దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, కంబోడియా ప్రధాని హున్‌సేన్, కజకిస్థాన్ అధ్యక్షుడు నుర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ తదితరులు ఈ సదస్సుకు హాజరవుతున్న వారిలో ఉన్నారు.

చిత్రం..శనివారం బీజింగ్ చేరుకున్న పాక్ బృందానికి స్వాగతం చెబుతున్న చైనా ప్రధాని