జాతీయ వార్తలు

బిజెపి పాలన వైఫల్యాలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ప్రధాని నరేంద్ర మోదీ తన మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ చీప్‌విప్ జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్, లోక్‌సభ సభ్యుడు సుష్మితాదేవ్, మాజీ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ తదితరులు మంగళవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మోదీపై విమర్శలు కురిపించారు. భావస్వామ్య పార్టీలతో కలిసి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆ పార్టీ ప్రకటించింది.
నరేంద్ర మోదీ మొత్తం 30 ముఖ్యమైన అంశాల్లో ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపించారు. 2014 నుండి 2016 మధ్య నాలుగు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పించ కలిగిందని వారు చెప్పారు. ప్రసంగాలు దంచటంలో ఘనుడైన మోదీ చెప్తున్న మంచి రోజులు ఎప్పుడు వస్తాయని వారు ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవటంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పాక్‌కు గట్టి గుణపాఠం చెప్తామంటూ అధికారంలో రాకముందు చేసిన ప్రకటన అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ మరిచిపోయారన్నారు. పాక్ మన సైనికుల తలలు నరికివేస్తుంటే మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు ఆధార్ కార్డును వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు ఆధార్ మన జీవనాధారమని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదర్శ గ్రామం పథకం ఎంతదూరం వచ్చిందని నిలదీశారు. మోదీ దత్తత తీసుకున్న జయాపూర్ గ్రామంలో రోడ్లు లేవు, విద్యుత్ లేదని జ్యోతిరాదిత్య ఎద్దేవా చేశారు.
జిఎస్‌టి విషయంలో కూడా మోదీ ద్వంద్వ వైఖరిని అవలంబించారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. జిఎస్‌టి మూలంగా దేశానికి ఎంతో నష్టం కలుగుతుందని అధికారంలోకి రాకముందు ఆరోపించిన మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని అమలులోకి తెస్తున్నారని విమర్శించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని ప్రధాని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మోదీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆరోపించి అధికారంలోకి వచ్చిన తరువాత వాటినే అమలు చేస్తున్నారని, అందుకే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని జ్యోతిరాదిత్య దుయ్యబట్టారు. దేశంలో ఇప్పుడు ప్రతిరోజూ 35 మంది రైతులు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. పంటల బీమా పథకం పేరుతో ప్రైవేట్ బీమా సంస్థలకు ప్రయోజనం కలిగించారని ఆరోపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో మోదీ ‘మేడ్ ఇన్ చైనా’ వస్తువులు పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నైపణ్యం పెంచుతామంటూ ఉన్న నైపుణ్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న అక్రమ ధనాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారని వారు ప్రశ్నించారు. 2020నాటికల్లా పేదవారందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇంతవరకు లక్ష ఇళ్లు మాత్రమే నిర్మించగలిగిందని వారు చెప్పారు. ఈ లెక్కన ఆరు వందల సంవత్సరాలైనా అందరికీ ఇంటి సౌకర్యం లభించదని వారు స్పష్టం చేశారు.

చిత్రం.. మంగళవారం ఎఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న సచిన్ పైలట్. చిత్రంలో ఆర్.పి.ఎన్.సింగ్, రణదీప్ సుర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియా