జాతీయ వార్తలు

జిజెఎం నేత ఇంటివద్ద సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూన్ 15: పశ్చిమ బెంగాల్‌లోని పర్వత ప్రాంతమైన డార్జిలింగ్‌లో వేర్పాటువాదులు, పోలీసులు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాద సంస్థ గోర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) చీఫ్ బిమల్ గురంగ్ నివాసం దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. తనీఖీల్లో భాగంగా పోలీసులు 300 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పేలుడు పదార్థాలతోపాటు బాణాలు కూడా ఉన్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కావాలనే తమ నాయకుడి ఇంటి వద్ద తనిఖీలు నిర్వహిస్తోందని గురంగ్ మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా నిరసనకారులు విసిరిన రాళ్లనే మళ్లీ వాళ్లపై రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో జిజెఎం చీఫ్ గురంగ్ డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు, పర్యాటకులెవరూ ఇక్కడికి రావద్దని హుకుం జారీ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు జిజెఎంకు చెందిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతోనే గురంగ్ నివాస పరిసరాల్లో తనిఖీలు నిర్వహించామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అయితే గురంగ్ ఇంటిలో మాత్రం తనిఖీలు నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోందని జిజెఎం ప్రధాన కార్యదర్శి గిరి ఆరోపించారు. తనిఖీల పేరుతో ఇక్కడి ప్రజలు సంప్రదాయబద్ధంగా వినియోగించే బాణాలు, విల్లంబులను మారణాయుధాలుగా పోలీసులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులు ఆర్చరీ పోటీలకు శిక్షణ పొందేందుకు తమ వద్ద ఉంచుకున్న బాణాలను మారణాయుధాలుగా పేర్కొనడంలో అర్థం లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని తాము కోరుతున్నందుకే రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రత్యేక గోర్ఖాలాండ్ కావాలని మరో ఆరు స్థానిక పార్టీలతో కలిసి జిజెఎం గత కొద్దికాలంగా పోరాటం చేస్తోంది. దీనికి స్థానికంగా మద్దతు లభించడంతో డార్జిలింగ్ కొండప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే వాదన స్థానికంగా బలపడుతుండడం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ అణచివేత ధోరణిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జిజెఎం నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జిజెఎం నేతలను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహిస్తుండడంతో డార్జిలింగ్‌లో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డార్జిలింగ్‌లో తాజా పరిస్థితులపై కేంద్రం సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చిత్రాలు.. . జిజెఎం నేత ఇంటివద్ద పోలీసుల సోదాల్లో బయటపడిన ఆయుధాలు, నోట్లకట్టలు