జాతీయ వార్తలు

రామ్‌నాథ్ అభ్యర్థిత్వంపై ఎవరేమన్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్
న్యూఢిల్లీ, జూన్ 19: రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేయడం విపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విసిరిన మాస్టర్ స్ట్రోక్ అని లోక్ జనశక్తి పార్టీ నేత, కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. దళిత అభ్యర్థిని అన్ని విపక్షాలు సమర్థించాలని ఆయన కోరారు. కోవింద్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెడితే వారు దళిత వ్యతిరేకులని రుజువవుతుందని వ్యాఖ్యానించారు. ‘ఇది చారిత్రక నిర్ణయం. విపక్షాలు రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి. లేకపోతే వారు దళిత వ్యతిరేకులుగా చరిత్రహీనులవుతారు’ అని అన్నారు. తమ పార్టీ కోవింద్‌ను పూర్తిగా సమర్థిస్తుందన్నారు. ‘కోవింద్‌ను ఎన్నిక చేయటం మోదీ వేసిన మాస్టర్ స్ట్రోక్. ప్రతి రాజకీయ పార్టీకి దాని అజెండా ఉంది. దళితుల కోసం పని చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకునే పార్టీలకు ఈ నిర్ణయం చెంపపెట్టు లాంటిది’ అని పాశ్వాన్ అన్నారు.

పరాజకీయేతర దళితుడైతే బాగుండేది
లక్నో, జూన్ 19: రాష్టప్రతి పదవికి ఒక దళితనేతను ఎన్డీఏ ఎంపిక చేయటం బిఎస్పీ అధినేత్రి మాయావతికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని కల్పించింది. ఎన్డీఏ అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి ప్రకటించటంతో మాయావతి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు. కోవింద్‌ను ఎంపిక చేయటంపై తమ పార్టీకి వ్యతిరేకత లేదని అయితే అతను రాజకీయేతరుడైతే మరింత బాగుండేదని ఆమె అన్నారు. ‘కోవింద్ మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ, బిజెపితోనూ అనుబంధం కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఆయన దళితుడు కావటంతో మా పార్టీ వ్యతిరేకించదు. అయితే విపక్ష పార్టీలు ఆయనకంటే మరింత సమర్థులైన దళిత నేతను ఎంపిక చేయకపోతే మా పార్టీ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుంది’ అని మాయావతి స్పష్టం చేశారు. ‘బిజెపి, ఎన్డీఏ రాజకీయాలతో సంబంధం లేని ఓ దళితుడిని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరింత బాగుండేది’ అని ఆమె అన్నారు. కోవింద్ ఎంపిక గురించి బిజెపి నేతలు అమిత్‌షా, వెంకయ్యనాయుడు తనకు సమాచారం ఇచ్చారని ఆమె వివరించారు. కోవింద్ దేశంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్న కోరి కులానికి చెందిన వాడని ఆమె చెప్పారు.
బిజెపిది ఏకపక్షం: ఏచూరి
న్యూఢిల్లీ, జూన్ 19: రాష్టప్రతి అభ్యర్థి పదవికి ఓ పక్క విపక్షాలతో చర్చల ప్రక్రియ ప్రారంభించి మూడు రోజులైనా గడవకుండానే బిజెపి ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘జూన్ 22న జరగనున్న విపక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. దేశ చరిత్రను గమనిస్తే ఒక్కసారి మినహా అన్ని సందర్భాల్లో అధికార, విపక్షాలు రాష్టప్రతి పదవికి అభ్యర్థులను నిలబెట్టాయి. నీలం సంజీవరెడ్డి ఒక్కరే చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది వారి ప్రతిపాదన. ప్రతిపక్షానికి చెప్పకుండానే ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించారు’ అని ఏచూరి అన్నారు. మరోవైపు బిజెపి నిర్ణయంపై చర్చించేందుకు దాని మిత్రపక్షం శివసేన ప్రత్యేకంగా సమావేశం కానుంది.

పోటీ తప్పదు: సురవరం
హైదరాబాద్, జూన్ 19: రాష్టప్రతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించిన రామ్‌నాథ్ కోవింద్‌పై వామపక్షాల అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతునిచ్చేది లేదని చెప్పారు. అభ్యర్థి ఎంపికకు ముఖ్య నాయకులతో సబ్-కమిటీని నియమిస్తామని, ఈ కమిటీ 21 లేదా అంత కంటేముందే సమావేశమవుతుందని ఆయన చెప్పారు. బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన ఈ మూడేళ్ళలో దేశాన్ని విభజించిందని, ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి రాష్టప్రతి అయితే దేశాన్ని ఇంకా విభజిస్తారని అన్నారు. కాబట్టి అభ్యర్థిని బరిలోకి దింపి పోరాడుతామని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా మద్దతునివ్వండి

లక్నో, జూన్ 19: రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ బలపరచాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామ్‌నాథ్ ఎంపిక దేశంలో దళిత సమాజానికి దక్కిన గౌరవం అని ఆయన సోమవారం అభివర్ణించారు. ‘దేశంలో అత్యున్నత పదవికి దళితుడిని ఎంపిక చేయటం కొత్త సామాజిక చైతన్యానికి నాంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నా’ అని యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్ ముద్దుబిడ్డ రాష్టప్రతి పదవికి ఎన్నిక కావటానికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన అన్నారు. 22కోట్ల యుపి ప్రజలకు ఇది గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.

రామ్‌నాథ్ గొప్ప రాజనీతిజ్ఞుడు: జగన్

హైదరాబాద్, జూన్ 19: రాష్టప్రతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేయనున్న ‘రామ్‌నాథ్ కోవింద్ గొప్ప రాజనీతిజ్ఞుడు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతునివ్వాల్సిందిగా కోరారు. అందుకు జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాను కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు రాష్టప్రతి ఎన్నిక ప్రస్తావన వచ్చిందని, రాష్టప్రతి అభ్యర్థిగా ఎన్డీయే ఎవరిని పోటీకి దించినా మద్దతు ఉంటుందని చెప్పానని జగన్ ఈ సందర్భంగా ఆయనతో ఉటంకించారు.