జాతీయ వార్తలు

విపక్షంలో చీలిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే అంశంపై ప్రతిపక్షంలో చీలిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జెడి(యు), బిఎస్‌పి మరికొన్ని పార్టీలతోపాటు ప్రతిపక్షానికి చెందిన మెజారిటీ దళిత ఎంపీలు రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీకి దిగినా, మరో దళిత నాయకుడిని పోటీకి పెట్టినా దళిత ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. బిజెపి వేసిన దళిత కార్డును ఎదుర్కొనేందుకు ప్రఖ్యాత దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రాం కూతురు, లోక్‌సభ మాజీ స్పకర్ మీరాకుమార్‌ను రంగంలోకి దించే విషయం కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు రావటం తెలిసిందే. రామ్‌నాథ్ కోవింద్ వివాదాలకు దూరంగా ఉండే దళిత నాయకుడు కావటంతో ప్రతిపక్షం ఇబ్బంది మరింత పెరిగిందని అంటున్నారు. బిహార్ గవర్నర్‌గా తమ ప్రభుత్వానికి అన్ని విధాల తోడ్పడిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వాలని జెడి(యు) భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జెడి(యు) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను గట్టిగా బలపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్‌నాథ్‌ను రాష్టప్రతి పదవికి తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బిజెపి ప్రకటించిన వెంటనే నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనను అభినందించటం తెలిసిందే. అంతకుముందు ఆయన రాష్టప్రతి ఎన్నిక గురించి చర్చించేందుకు సోనియా గాంధీ ఏర్పాటుచేసిన ప్రతిపక్ష పార్టీల అధినాయకుల సమావేశానికి హాజరుకాకుండా ఆ మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన సమావేశానికి వెళ్లటం తెలిసిందే. ఇదిలాఉంటే దళితుల ప్రయోజనాలకోసం ఏర్పడిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వవచ్చునని అంటున్నారు. ఎన్‌డిఏ మిత్రపక్షాలతోపాటు పలు ఇతర పార్టీలు కూడా రామ్‌నాథ్‌కు మద్దతు ఇస్తున్నప్పుడు మనమెందుకు వ్యతిరేకించాలని పలువురు ప్రతిపక్ష నాయకులు అంటున్నట్లు తెలిసింది. వీరు తమ అభిప్రాయాలను సోనియా గాంధీ అధ్యక్షతన ఈ నెల 22న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో వ్యక్తం చేయనున్నారు. ప్రతిపక్షానికి చెందిన దళిత ఎంపీలు రామ్‌నాథ్‌కు మద్దతు ప్రకటించటం ప్రతిపక్ష నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఓటింగ్ సమయంలో ప్రతిపక్షానికి చెందిన దళిత ఎంపీలు రామ్‌నాథ్‌కు అనుకూలంగా ఓటు వేస్తే తమ ప్రతిష్ట దెబ్బతింటుందని ప్రతిపక్ష నాయకులు ఆందోళన చెందుతున్నారు.
సిద్ధమవుతున్న నామినేషన్ పత్రాలు
ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ బిజెపి రాష్టప్రతి అభ్యర్థి నామినేషన్ పత్రాలను సిద్ధం చేయించి ఎన్‌డిఏ మిత్రిపక్షాల నాయకుల సంతకాలు తీసుకోవటం ప్రారంభించారు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహులు మంగళవారం అనంత కుమార్ కార్యాలయానికి వెళ్లి రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రతిపాదించే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. రామ్‌నాథ్ అభ్యర్థిత్వాన్ని తమ పార్టీ పూర్తిగా బలపరుస్తోందని తోట నరసింహులు ప్రకటించారు.