జాతీయ వార్తలు

కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ, జూన్ 25: ఒడిశాలోని పూరీలో ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జగన్నాథ రథయాత్ర అశేష భక్త జనావళి జయ జయధ్వానాల మధ్య మొదలైంది. జోరువర్షాలు కురుస్తున్నప్పటికీ దేశం నలుమూలలనుంచి, విదేశాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రను తిలకించడానికి రావడంతో పూరీ నగరం భక్తజన సంద్రంగా మారిపోయింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను అధిష్ఠింప జేసిన రథాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిచా ఆలయం దాకా వెళ్లే ప్రధానమార్గం ‘బడా దండా’ పొడవునా లక్షల సంఖ్యలో బారులు తీరి రథయాత్రను కన్నులారా తిలకించి పులకించి పోయారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రథయాత్రలో పాల్గొన్నారు. రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తదితర ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రథయాత్ర సందర్భంగా జనం రథాలపైకి ఎక్కి విగ్రహాలను తాకడాన్ని నిషేధించినట్లు జగన్నాథ ఆలయం ప్రధాన కార్యనిర్వాహక అధికారి పికె జైన్ తెలిపారు. కాగా, లక్షల సంఖ్యలో జనం నగరానికి వస్తున్న దృష్ట్యా పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గగనతలం, తీర ప్రాంత గస్తీతో పాటుగా 127 ప్లాటూన్ల బలగాలను బందోబస్తు కోసం మోహరించారు. ఆలయం వద్ద, రథాలు వెళ్లే ప్రధాన మార్గం, బీచ్ రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కెబి సింగ్ చెప్పారు. వీరే కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్, ఎటిఎస్, రాఫ్ జవాన్లతో పాటుగా షార్ప్ షూటర్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. సముద్ర తీరం వెంబడి కోస్ట్‌గార్డు నిఘా ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర కోసం జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను గర్భాలయంనుంచి బైటికి తీసుకు రావడానికి ముందు మంగళహారతిలాంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రత్న సింహాసనంపై ఉన్న విగ్రహాలను ‘బైసి పహచా’గా పిలవబడే 22 మెట్ల గుండా ఆలయ సింహద్వారంనుంచి బైటికి తీసుకు వచ్చారు. పహాండిగా పిలవబడే ఈ కార్యక్రమం సందర్భంగా భక్తజనం విగ్రహాలను తాకేందుకు ఎగబడ్డారు. ఘంటానాదాలు, కాహళీలు, శంఖనాదాల మధ్య లయబద్ధంగా విగ్రహాలను ఆలయం బైటికి తీసుకు వచ్చి అప్పటికే అలంకరించి సిద్ధంగా ఉంచిన రథాలపై అధిష్ఠింపజేశారు. పూరీ గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తన శిష్యబృందంతో కలిసి రథాలపై ఉన్న విగ్రహాలను దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం పూరీ గజపతి రాజవంశీకుడైన దివ్య సింగ్ దేవ్ బంగారు చీపురుతో రథాలు పయనించే మార్గాన్ని ఊడ్చడంతో రథయాత్ర ప్రారంభమైంది. గుడిచా ఆలయానికి చేరిన విగ్రహాలు తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకోవడంతో జగన్నాథ రథయాత్ర ముగుస్తుంది.

చిత్రాలు.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జగన్నాథ రథయాత్ర ఆదివారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. పూరీ, అహ్మదాబాద్‌లలో ఆదివారం జరిగిన రథయాత్రకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అహ్మదాబాద్‌లో జరిగిన రథయాత్రలో భాగంగా రూపొందించిన శకటాన్ని ప్రధాని మోదీ, వ్యోమగామి సునీతా విలియమ్స్, ఇస్రో చిత్రాలతో అలంకరించారు.